ముద్దు పెట్టుకుంటే ఎక్కువ ప్రయోజనం ఎవరికో తెలుసా?

సోమవారం, 15 అక్టోబరు 2018 (14:31 IST)
ఓ అందాల రాశికి అందగాడు ముద్దిస్తే ఏమవుతుంది..? ఆ అమ్మాయి నాన్నో, అన్నో చూస్తే ఒళ్లు హూనమవుతుంది.. వాళ్ళు ఒప్పుకుంటే పెళ్ళవుతుంది.. లేదంటే గిల్లవుతుంది... మరేదో అవుతుంది. కాసేపు ఈ కథనంతా పక్కన పెట్టేస్తే.. అసలు ముద్దు పెడితే ఏమవుతుందన్నదనే విషయాన్ని ఇక్కడ పరిశీలిద్దాం. 
 
ముద్దు పెడితే శరీరం లోపల కొన్ని రసాయనిక మార్పులు జరుగుతాయని చికాగోకు చెందిన కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు. ప్రేమజంటలపై నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని వారు పేర్కొన్నారు.
 
వివరాల్లోకి వస్తే... ఈ పరిశోధకులు అధ్యయనంలో భాగంగా, ముందుగా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన కొన్ని ప్రేమ జంటలను... ముఖ్యంగా కాలేజీ విద్యార్థులను వెదికి పట్టుకున్నారు. వీరందర్నీ ఒక గదిలో ఉంచి, మంద్ర స్థాయిలో మంచి సంగీతం వినిపిస్తూ, వారి వారి భాగస్వాములను ముద్దు పెట్టుకోమని చెప్పారు. ఇంకేముంది అంత మంచి అవకాశాన్ని వదులుకోలేని ఆ ప్రేమ జంటలు ఓ పదిహేను నిమిషాలపాటు ముద్దుల్లో మునిగిపోయారు.
 
ఈ లోపు పరిశోధకులు తమకు రావాల్సిన సమాచారాన్ని రాబట్టుకున్నారు. ప్రేమజంటలు గాఢ చుంబనంలో ఉండగా వారి శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ (ప్రేమబంధాలు గట్టిపడేందుకు ఈ రసాయనమే ముఖ్య కారణం), కార్టిసాల్ (ఆందోళనకు కారణమయ్యే రసాయనం) రసాయనాల మోతాదును పరిశోధకులు లెక్కగట్టారు. పరీక్షకు ముందు, తరువాతి మోతాదులను పోల్చి చూశారు.
 
చివరకు వీరి పరిశోధనల్లో తేలిందేమంటే... ముద్దు తరువాత యువతీయువకులిద్దర్లోనూ కార్టిసాల్ విడుదల బాగా తగ్గిపోయిందనీ, ఫలితంగా వారిలో మానసిక ఒత్తిడి దూరమైందని తెలుసుకున్నారు. అలాగే యువకుల్లో ఆక్సిటోసిన్ విడుదల పెరగడాన్ని గమనించారు. అదే సమయంలో యువతుల్లో ఆక్సిటోసిన విడుదల తగ్గిపోయింది. 
 
ముద్దులోని గమ్మత్తేమిటో... ఒక్క ముద్దు ఇస్తేనే (అది ఫ్లయింగ్ కిస్సయినా సరే) కుర్రకారు మతులు పోగొట్టుకుంటూ అమ్మాయిల చుట్టూ ఎందుకు తిరుగుతారో ఇప్పుడర్థమైంది కదూ... దీనికి ప్రధాన కారణం ఆక్సిటోసిన్ అనే రసాయనం ముద్దు సమయంలో ఎక్కువగా విడుదల కావడమే.
 
ఇదలా ఉంచితే... అబ్బాయిల్లో సంతోషాన్ని పెంచే ఆక్సిటోసిన్, అమ్మాయిల్లో తగ్గిపోవడానికి మాత్రం పరిశోధకులకు కారణం అంతుబట్టడం లేదు. ఏదేమయినప్పటికీ... ప్రేమబంధం బలపడేందుకు ముద్దే ప్రధాన పాత్ర వహిస్తుందని మొత్తానికి వారు తేల్చేశారు.ముద్దు ద్వారానే ప్రేమజంటల నడుమ అనుబంధం, శృంగారభరిత ప్రేమ, ఒకరినొకరు కావాలనుకునే కోరిక మరింతగా బలపడతాయని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు