మావోయిస్టు తిరుగుబాటుదారులతో శాంతి ఒప్పందంలో భాగంగా నేపాల్ పార్లమెంట్ రాజరికాన్ని రద్దు చేసింది. రాజరికాన్ని రద్దు చేయనిదే తాము వెనుదిరిగి రామని 2007 సెప్టెంబర్‌లో ప్రకటించిన మావోయస్టులు నేపాల్ ప్రభుత్వం నుంచి వైదొలిగారు.
2007లో వీరు నేపాల్‌లో గత పదేళ్లుగా కొనసాగుతున్న తిరుగుబాటుకు స్వస్తి పలికి ప్రధాన స్రవంతిలోకి వచ్చారు. 2008 ఏప్రిల్ నెలలో పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాత నేపాల్‌ను రిపబ్లిక్‌గా ప్రచురించనున్నారు
నేపాల్‌ను 1769 నుంచి ఏకచ్చత్రాధిపత్యంగా ఏలుతున్న రాణా వంశానికి చెందిన రాజు జ్ఞానేంద్ర 2005లో ప్రభుత్వాన్ని రద్దు చేసి అధికారాన్ని తన గుప్పిట పెట్టుకోవడంతో రాజవంశం పట్ల ప్రజాదరణ అడుగంటిపోయింది. ఈ నేపధ్యంలో పార్లమెంటులో చేపట్టిన ఓటింగులో 371మంది ఎంపీలలో 270 మంది నేపాల్‌లో రాజరికం రద్దుకు అనుకూలంగా ఓటేయగా, ముగ్గురు మాత్రమే రాజరికానికి అనుకూలంగా ఓటేశారు.
నేపాల్ రిపబ్లిక్‌గా ఏర్పడాలా వద్దా అనే విషయాన్ని 2008 ఏప్రిల్‌లో ఎంపిక కానున్న రాజ్యాంగ సభకు వదిలివేయాలని ప్రధాన రాజకీయ పార్టీలు అంగీకరించాయి. అయితే నేపాల్ రాజరికం రద్దుకు సంబంధించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని మావోయిస్టులు పట్టుబట్టడంతో ప్రధాన రాజకీయ పక్షాలు అంగీకారానికి వచ్చి ఓటింగ్‌కు సమ్మతించాయి. దీంతో మావోయిస్టులు తిరిగి ప్రభుత్వంలో చేరడానికి మార్గం సుగమమైంది.
దేశంలో అవినీతిని పారద్రోలడానికి, మావోయిస్టు తీవ్రవాదాన్ని అణచివేయడానికి పార్లమెంట్‌ను రద్దుచేసి అధికారాలను గుప్పిటపెట్టుకోవడమే మార్గమని ప్రకటించిన జ్ఞానేంద్ర అన్నంతపనీ చేయడంతో అతడి దూకుడు చర్యకు రాజకీయ వ్యతిరేకత పెరిగింది. దీనికి తోడు హింసాత్మక తిరుగుబాటు ప్రజ్వరిల్లడంతో పార్లమెంటును జ్ఞానేంద్ర పునరుద్ధరించవలసి వచ్చింది.
తర్వాత పార్లమెంట్ నేపాల్ రాజు అధికారాలను తొలగించి, సైన్యంపై అతడి ఆజమాయిషీని తీసివేసింది. అతడిని న్యాయవిచారణకు గురి చేయరాదనే నిబంధనను సైతం తొలగించారు. చివరిగా ఆతడి రాజరికపు చిహ్నాన్ని కూడా రద్దు చేశారు.