మకర సంక్రాంతి భావమేమిటో తెలుసా!?

బుధవారం, 12 జనవరి 2011 (14:24 IST)
WD
ఉత్తరాయణ పుణ్యదినమైన మకర సంక్రాంతి అంటేనే డూడూ బసవన్నలు, హరిదాసుల పాటలు మనకందరికీ గుర్తుకు వచ్చేస్తుంటాయి. అయితే మకర సంక్రాంతి అనేది సౌర కుటుంబంలో సూర్యుడు మనిషిని ప్రభావితం చేసే ఒక ప్రధానమైన అంశమేని, అందుకే సూర్యునికి సంబంధించిన ఈ పండుగను ప్రజలు ఎంతో విశేషంగా జరుపుకుంటారు.

ఆకాశం గాలి పటాల చుక్కలపరుచుకున్నప్పుడు.. భూమి రంగు రంగుల రంగవల్లుల అల్లికలతో వైభవోపేతమైన అందాన్ని సమకూర్చుకుంటుంది. పట్టణమైనా, పల్లెలైనా, సంక్రాంతి శోభ పరచుకుంటాయి. తెలుగు వారికి పుష్య మాసంలో (జనవరి - ఫిబ్రవరి నెలల్లో) వచ్చే అత్యంత ముఖ్యమైన పండుగ - సంక్రాంతి.

నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ తొలి రోజు భోగీ, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ, నాలుగున ముక్కనుమగా జరుపుకుంటారు. సంక్రాంతి నుండి ఉత్తరాయన పుణ్య కాలం మొదలై ఆరు నెలల వరకు ఉంటుంది. ఇది దేవ కాలము, ఎంతో శుభదాయకమైనదని పురోహితులు చెబుతున్నారు.

సూర్యుడు ప్రత్యక్ష బ్రహ్మ, కాల చక్రానికి అతీతంగా సంచరిస్తూ ఉండే పరమాత్మ స్వరూపం. ఉత్తరాయణంలో సూర్యుడు ధనురాశి నుండి మకర రాశి లోకి వచ్చే రోజు మకర సంక్రమణం జరిగే రోజునే మకర సంక్రాంతిగా జరుకుంటున్నాం..! మరి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..!

వెబ్దునియా పై చదవండి