పీఆర్పీలో లోపాలున్నాయా..? తెలిసి కూడా చెప్పలేదో తల వేయి వక్కలవుతుంది

వీక్షకులకు నమస్కారం...
చెవాకులు శీర్షికలో చిన్న కథనాన్ని మీ ముందుచుతున్నాం. దీనిపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తెలియజేయగలరు...

నేటి ఆధునిక యుగంలోనూ రాజావిక్రమార్క తన పట్టుదలను వదల్లేదు. చీమలు దూరని చిట్టడివిలోకెళ్లి మఱ్టి వృక్షానికి వేళాడుతున్న భేతాళుడిని దించి తన భుజాన వేసుకుని అడవిలో నడవడం ప్రారంభించాడు. ఎప్పటిలానే భేతాళుడు... విక్రమార్కునికి ఓ కథ చెప్పడం మొదలుపెట్టాడు.

రాజా... చెప్పేది జాగ్రత్తగా విను. భారతదేశంలోని ఆంధ్ర రాజకీయాల గురించి నీకు చెప్పబోతున్నా. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగువారి వెండితెర అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించినప్పుడు అందరూ మెగాదే రాజ్యం అనుకున్నారు. అలా విశ్వసించినవారిలో మచ్చుకు నీకు కొన్నిపేర్లు చెపుతా... మిత్రా, పరకాల ప్రభాకర్, ఆంజనేయరెడ్డి, టి. దేవేందర్ గౌడ్.. వంటివారితోపాటు మరో రాజకీయ పక్షం తెలుగుదేశం నుంచి వచ్చినవారున్నారు. అటు పిమ్మట కాంగ్రెస్ గూటి నుంచి కొందరు వృద్ధ నేతలు సైతం తోసుకు వచ్చారు.

ఎన్నికలు జరిగే సమయం ఆసన్నమైంది. కొందరు టిక్కెట్లు కావాలని మారాం చేశారు. ఇంకొందరు టిక్కెట్లివ్వలేదని ప్రజారాజ్యంపై దుమ్ము పోశారు. అయినా పోసిన దుమ్ము చాల్లేదంటూ మైకులు పట్టుకుని చిరంజీవి పార్టీ ఓ వ్యాపార పార్టీ అనేశారు. అయినా ప్రజారాజ్యం పార్టీ అధినేత పట్టించుకోలేదు. ఎన్నికల కదన రంగంలో దుమికాడు. అన్నయ్య మెగా రాజ్యం అనూహ్యంగా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లక్కీ నెంబర్‌ను సాధించింది. ఆ లక్కీ నెంబర్ ఎంతో తెలుసా...?

విక్రమార్క: ఎంత?
భేతాళుడు: 18. ఇక ఇక్కడనుంచే అసలు కథ మొదలైంది.
ఓడినవారు ముఖం చూపించలేక పార్టీ ఆఫీసుకు రావడం దాదాపు మానేశారు. పార్టీ పెట్టండీ... అంటూ పిలిచిన "మిత్రు"డు హ్యాండ్ ఇచ్చాడు. దీంతో చిర్రెత్తిన అన్నయ్య ఎవరెళ్లినా పార్టీ నడుస్తుందన్నాడు. ఒక దశలో తాను పార్టీ వదిలిపెట్టినా ఢోకా లేదనేశాడు. కాలం గడుస్తోంది. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల తరుణం రానే వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ పటిష్టతకు చర్యలు మొదలుపెట్టారు అన్నయ్య. ఇంతలో మాల్యాల రాజయ్య పీఆర్పీ గూడు వదిలి టీడీపి చెట్టుపై వాలాడు.

అంతే.. గౌడ్ మీడియా ముందుకు వచ్చారు. పీఆర్పీలో సైద్ధాంతిక లోపాలున్నాయని చెప్పాడు. ఆయనే కాదు, పీఆర్పీ గూటిని వదిలివెళ్లిన వారంతా దాదాపు అలాంటి వ్యాఖ్యలనే చేసి వెళ్లిపోయారు. ఇది ఇప్పటివరకూ జరిగిన లఘు కథ... విన్నావుగా.. రాజా...

విక్రమార్క.. విన్నాను
భేతాళుడు... ఇప్పుడు నీకో ప్రశ్న...
నిజంగా గౌడ్ చెప్పినట్లు పీఆర్పీలో లోపాలున్నాయా..? తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో తల వేయి వక్కలవుతుంది. జాగ్రత్త అన్నాడు..
మరి రాజావారు ఏం సమాధానం చెపుతారో తెలుసుకోవాలంటే కొంత కాలం ఎదురు చూడాలి.