తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిన ప్రముఖ నటి రోజాకు ఎటువెళ్లాలో దారి తోచడం లేదు. సొంత పార్టీని వీడి.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోదామంటే.. ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు గంగాభవానీ రోజాపై నిప్పులు చెరుగుతున్నారు.
ఒకవైపు ప్రజారాజ్యం పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి రోజాపై విమర్శల వర్షం కురిపిస్తుంటే.. ఆమె బాటలోనే గంగాభవానీ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు.
తాజాగా దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్. జగన్మోహన రెడ్డికి సీఎం పదవి రాకపోతే దానికి రోజానే కారణమని ధ్వజమెత్తారు. రోజాది ఐరన్‌లెగ్ అంటూనే.. ఆమె గనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వైఎస్సార్‌పై చేసిన విమర్శలకు గాంధీభవన్ ముందు ముక్కు నేలకు రాచి క్షమాపణ చెప్పి మరీ రావాలన్నారు.
దివంగత ముఖ్యమంత్రిని గత ఆదివారం కలిసి పుష్పగుచ్ఛం అందించిన రోజా, ఆయన చనిపోయిన తర్వాత పట్టుచీర కట్టుకుని చక్కగా అలంకరించుకుని వైఎస్సార్ పార్థివ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచిందని గంగాభవానీ దుమ్మెత్తి పోశారు. తెలుగుదేశం పార్టీని ముంచిన రోజా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై పడిందని ఆమె తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధించారు.
గ్లామర్ తగ్గిపోయిన తెలుగుదేశం పార్టీని వదిలి.. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీవైపు కన్నేసిన రోజాను పీఆర్పీ వైపు రావద్దు తల్లీ..! అంటూ శోభారాణి కోరుకున్న నేపథ్యంలో.. రోజా.. ఏ మార్గంలో పయనిస్తుందో వేచి చూడాల్సిందే..!.