టెన్నిస్ క్రీడలో మహిళల తరపున అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లను కైవసం చేసుకుని స్టెఫీ గ్రాఫ్ రికార్డు సృష్టించింది. ప్రపంచ నెంబర్‌వన్ క్రీడాకారిణిగా 337 వారాలపాటు కొనసాగి గ్రాఫ్ తన సత్తా ఏమిటో చాటిచెప్పింది. స్టెఫానీ మారియా గ్రాఫ్‌గా పిలిచే స్టెఫీ 1969 జూన్ 14వ తేదీన పశ్చిమ జర్మనీలోని మానిహెమ్‌లో జన్మించింది. స్టెఫీ చిన్నప్పటి నుంచి టెన్నిస్ క్రీడపై మక్కువ చూపించటంతో ఆమె తండ్రి పీటర్ గ్రాఫ్ శిక్షణకు ఏర్పాట్లు చేశారు.
స్టెఫీ మూడేళ్ల చిరుప్రాయంలోనే చెక్క రాకెట్ బ్యాట్ పట్టుకుని ఆడుతుండేది. ఐదేళ్ల ప్రాయంలోనే స్టెఫీ తొలి టోర్నీ ఆడింది. 12ఏళ్ల లేత ప్రాయంలో స్టెఫీ యూరోపియన్ ఛాంపియన్‌షిప్స్ టోర్నీని కైవసం చేసుకుంది. అదే ఫీట్‌ను 18ఏళ్ల వయస్సులో చేసింది. గ్రాఫ్ తొలి ప్రొఫెషనల్ టోర్నీని జర్మనీ స్టట్‌గార్ట్‌లో 1982లో ఆడింది. అయితే ఈ మ్యాచ్‌లో గ్రాఫ్ ఓడిపోయింది.
1986 నాటికి రాటుదేలిన గ్రాఫ్ అప్పటి ప్రపంచ నెంబర్‌వన్ తార మార్టినా నవ్రతిలోవాకు పోటీగా నిలిచింది. 1985, 1986 నాటికి అనేక టోర్నీలలో ఆడినప్పటికీ సెమీస్, ఫైనల్స్‌లో పరాజయం పాలవుతూ ఎగుడుదిగుడులను స్టెఫీ ఎదుర్కొంది. అమెరికాలోని హిల్టన్ హెడ్‌లో 1986లో నిర్వహించిన ఫ్యామిలీ సర్కిల్ కప్ టైటిల్‌ను గ్రాఫ్ కైవసం చేసుకుంది. గ్రాఫ్ కెరీర్‌లో తొలి టైటిల్ ఇదే కావడం విశేషం.
1987లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పైనల్లో మార్టినా నవ్రతిలోవాను ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను స్టెఫీ గ్రాఫ్ అందుకుంది. అదే ఏడాది జరిగిన వింబుల్డన్ ఫైనల్లో నవ్రతిలోవా చేతిలో గ్రాఫ్ పరాజయం పాలైంది. అదే ఫలితం యూఎస్ ఓపెన్‌లో కూడా చోటుచేసుకుంది. ఇదే ఏడాది ప్రపంచ నెంబర్‌వన్ తారగా స్టెఫీ గ్రాఫ్ ఎదిగింది.
1988లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్, ప్రెంచ్ ఓపెన్‌లలో గ్రాఫ్ జయభేరి మోగించింది. ఇదే ఏడాది జరిగిన సియోల్ ఒలింపిక్ క్రీడల్లో సింగిల్స్‌లో స్వర్ణం, డబుల్స్‌లో కాంస్య పతకాన్ని గ్రాఫ్ అందుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను 1988, 89, 90, 94లలో, ఫ్రెంచ్ ఓపెన్‌ను 1987, 88. 93, 95, 96, 99లలో గ్రాఫ్ అందుకుంది.
వింబుల్డన్ టోర్నీని 1988, 89, 91, 92, 93, 95, 96, యూఎస్ ఓపెన్‌ను 1988, 89, 93, 95, 96 సంవత్సరాల్లో గ్రాఫ్ అందుకుంది. టెన్నిస్‌లో ప్రతిష్టాత్మక నాలుగు టోర్నీలైన ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లను ఒకే ఏడాది అంటే 1988లో అందుకుని గ్రాఫ్ రికార్డు సృష్టించింది.
స్టెఫీ గ్రాఫ్ గ్రాండ్‌స్లామ్ విభాగంలో 22 టైటిళ్లను కైవసం చేసుకోగా, తొమ్మిదింట్లో రన్నరప్‌గా నిలిచింది. గ్రాండ్‌స్లామ్ డబుల్స్ విభాగంలో అర్జెంటీనా క్రీడాకారిణి గాబ్రియా సెబాస్టినితో జతకట్టి 1988 వింబుల్డన్ టోర్నీని గ్రాఫ్ కైవసం చేసుకుంది. అలాగే సెబాస్టినీతో జతకట్టి ఫ్రెంచ్ ఓపెన్ 1986, 87, 89లలో గ్రాఫ్ పరాజయం పాలైంది. ఇవి కాకుండా 107 డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్స్‌ను గ్రాఫ్ అందుకుంది.
స్టెఫీ గ్రాఫ్ 1995 వరకూ పన్నుల ఎగవేత కేసును ఎదుర్కొని కష్టాల్లో పడింది. ఈ సమయంలో పరిచయమైన మరో టెన్నిస్ ధిగ్గజం అండ్రీ అగస్సీతో స్నేహం పెంపొందింది. 2001లో వారి వివాహం జరగ్గా అదే ఏడాది జేడెన్ గిల్‌కు, 2003లో జాజ్ ఎల్లీకి జన్మనిచ్చింది. ప్రస్తుతం వారిద్దరూ విడిగా ఉంటున్నారు.