యూరో కప్ : అగ్ర జట్లకు కష్టాలు

Pavan Kumar

శుక్రవారం, 13 జూన్ 2008 (19:51 IST)
యూరో కప్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరే దశలో అగ్ర జట్లకు కష్టాలు మొదలయ్యాయి. సాకర్ ప్రపంచ ఛాంపియన్ ఇటలీ, సాకర్ 2006 ఫైనలిస్ట్ ఫ్రాన్స్, 2006 సెమీ ఫైనలిస్ట్ జర్మనీలు పరాజయాలతో సతమవుతున్నాయి. మరవైపు ఆతిథ్య జట్లు స్విట్జర్లాండ్, ఆస్ట్రియాలు గెలుపు బోణీ కొట్టకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమైంది.

టోర్నీ రెండవ దశలోకి పోర్చుగల్, క్రొయేషియాలు ప్రవేశించాయి. గ్రూప్ ఎ నుంచి పోర్చుగల్ ముందంజ వేయగా, స్విస్ ఇప్పటికే టోర్నీ నుంచి తప్పుకుంది. స్విస్ తన చివరి మ్యాచ్‌లో పటిష్టమైన పోర్చుగల్‌తో ఆదివారం తలపడుతుంది. కనీసం గెలుపుతోనైనా గట్టెక్కాలన్నది స్విస్ ఆకాంక్ష. ఇదే గ్రూప్ నుంచి టర్కీ-చెక్‌ల కీలకమైన మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. ఈ మ్యాచ్ విజేత గ్రూప్ ఎ నుంచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెడుతుంది.

ప్రపంచ కప్ 2006 సెమీ ఫైనలిస్ట్, పటిష్టమైన జట్టు జర్మనీపై 2-1 గోల్స్ తేడాతో క్రొయేషియా సంచలన విజయం సాధించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. జర్మనీ తన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రియాపై తప్పనిసరిగా గెలిస్తేనే తదుపరి దశలోకి ప్రవేశం. క్రొయేషియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో జర్మనీ క్రీడాకారులు తమ స్థాయికి తగ్గ విధంగా రాణించక పోవటంతో క్రొయేషియా దానిని సొమ్ము చేసుకుని విజయంగా మలుచుకుంది. టోర్నీ ఫేవరేట్ జట్టుగా జర్మనీ బరిలోకి దిగి అభిమానులకు ఇప్పటివరకూ నిరాశను మిగిల్చింది.

గ్రూప్ ఆఫ్ డెత్‌గా పిలిచే సీ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ఎవరూ ప్రవేశించకపోవడం గమనార్హం. పాయింట్ల పట్టికలో హాలెండ్ ముందుండగా తర్వాత స్థానం కోసం మిగిలిన మూడు జట్ల మధ్య అదృష్టం దోబూచులాడుతుంది. రొమేనియాతో శుక్రవారం జరిగే కీలకమైన మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్ ఇటలీ ఘన విజయం సాధిస్తేనే క్వార్టర్స్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి మ్యాచ్‌లో ఇటలీ-ఫ్రాన్స్‌ల మధ్య ఆదివారం జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన వారికే క్వార్టర్స్‌లోకి ప్రవేశం.

గ్రూప్ డీ నుంచి ఇప్పటివరకూ ఎవరూ క్వార్టర్స్‌లోకి ప్రవేశించలేదు. స్పెయిన్, స్వీడన్‌లు మాత్రం పాయింట్ల పట్టికలో సమానంగా ఉన్నాయి. ఈ రెండు అగ్ర జట్లకు చేతిలో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఏదో అద్భుతం జరిగితే తప్ప గ్రీస్, రష్యాలు క్వార్టర్స్‌లోకి ప్రవేశిస్తాయి.

యూరో కప్ 2008 అభిమానులకు మంచి ఆనందాన్ని పంచుతున్నాయి. అగ్ర జట్ల కంటే చిన్న జట్లు మెరుగ్గా రాణించి వారికి కంటుమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. యూరో కప్ క్వార్టర్స్ దశ పోరు గురువారం నుంచి మొదలవుతాయి. అప్పటివరకూ అభిమానులు కాస్తంత సహనం పాటించాల్సిందే.

వెబ్దునియా పై చదవండి