రష్యా యువతేజం నాడియా పెట్రోవా టెన్నిస్‌లో రాణిస్తూ ముందుకు దూసుకు వెళుతోంది. రష్యా యువతారలైన మరియా షరపోవా, మరియా కిర్లెంకోలతో పోటీపడుతూ ముందుకు సాగుతోంది పెట్రోవా. అయితే వ్యూహాత్మకంగా కీలకమైన మ్యాచ్‌లలో ఓడిపోతుండటం పెట్రోవా బలహీనత.
నాడియా పెట్రోవా రష్యా రాజధాని మాస్కోలో 1982, జూన్ 8వ తేదీన జన్మించింది. చిన్ననాటి నుంచే టెన్నిస్ క్రీడపై పెట్రోవా ఆసక్తి కనబరిచి దానిని నేర్చుకుంది. 1996లో ఆడిన తొలి ఐటీఎఫ్ సర్క్యూట్‌లో ఆడిన రెండు ఈవెంట్స్‌లో జయభేరి మోగించింది. ఐటీఎఫ్ టోర్నీలో తొలి సింగిల్స్ టైటిల్‌ను 1997లో పెట్రోవా కైవసం చేసుకుంది.
పెట్రోవా కెరీర్‌ను మలుపు తిరిగింది 1999లో. ఈ సంవత్సరం కెరీర్‌లో అత్యుత్తమంగా ఆడి 95వ ర్యాంకును పెట్రోవా చేరుకుంది. అలాగే ఆస్ట్రేలియన్, రోలాండ్ గారోస్, యూఎస్ ఓపెన్‌లకు ఎంపికైంది. 2003లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించి రోలాండ్ గారోస్ గ్రాండ్‌స్లామ్ సెమీస్‌కు చేరుకుంది. క్లిజస్టర్స్ చేతిలో పెట్రోవా పరాజయం పాలైంది. కెరీర్‌లో తొలిసారి సింగిల్స్ లింజ్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నా సిగియామా చేతిలో పరాజయం పాలైంది. ఇదే ఏడాది టాప్20 జాబితాలో పెట్రోవా అడుగుపెట్టింది.
2005లో జరిగిన లింజ్ ఓపెన్ ఫైనల్లో పాటీ షిడ్నర్‌ను ఓడించి పెట్రోవా టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. అలాగే టాప్10లో స్థానం సంపాదించి ముందుకు సాగింది పెట్రోవా. పెట్రోవా ఆటతీరును మరింత మెరుగుపరుచుకుని ముందుకు సాగుతుందని ఆశిద్ధాం. ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో నాడియా పెట్రోవా తలపడుతుంది. పెట్రోవా ఇప్పటివరకూ 7 సింగిల్స్, 12 డబుల్స్ టైటిళ్లను కైవసం చేసుకుంది.