సెర్బియా యువతార అనా ఇవనోవిక్

ప్రపంచ టెన్నిస్ క్రీడ సంచలన యువతార, సెర్బియా అందగత్తె అనా ఇవనోవిక్. డబ్ల్యూటీఏ తాజా ర్యాంకింగ్స్‌లో ఇవనోవిక్ ద్వితీయ స్థానంలో కొనసాగుతుంది. సెర్బియా తారగా టెన్నిస్‌లో రాణిస్తున్నది ఇవనోవిక్. సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో అనా ఇవనోవిక్ 1987, నవంబరు 6వ తేదీన జన్మించింది.

ఇవనోవిక్ చిన్ననాటి నుంచి టెన్నిస్ క్రీడపై దృష్టిపెట్టి అందులో మెళుకువలు నేర్చుకుంది. బెల్‌గ్రేడ్ విశ్వవిద్యాలయంలో ఆర్ధిక శాస్త్రం చదువుకుంటూనే టెన్నిస్‌పై మక్కువ చూపింది ఇవనోవిక్. సెర్బియా దేశం తరపున యూనిసెఫ్ జాతీయ రాయబారిగా ఇవనోవిక్ 2007లో ఎంపికైంది.

ఇవనోవిక్ తొలిసారి టెన్నిస్ క్రీడలో రాణించింది 2004 వింబుల్డన్ జూనియర్ టోర్నీలో. టోర్నీ ఫైనల్లో కత్రేనా బోండరెంకో చేతిలో ఇవనోవిక్ పరాజయం పాలైంది. 2007లో ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జస్టిన్ హెనిన్ చేతిలో 6-1, 6-2 సెట్ల తేడాతో పరాజయం పాలై తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకునే అవకాశాన్ని కోల్పోయింది.

2008 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మరియా షరపోవా చేతిలో 7-5, 6-3 సెట్ల తేడాతో ఇవనోవిక్ ఓటమి పాలైంది. ఈ రెండు టోర్నీలలో ఇవనోవిక్ కనబరిచిన తీరు అందరినీ ఆకట్టుకుంది. డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లోకి 9సార్లు ప్రవేశించగా ఆరుసార్లు విజేతగా ఇవనోవిక్ నిలిచింది.

2007లో అత్యధికంగా మూడు టోర్నీలలో అడుగుపెట్టి ఇవనోవిక్ రాణించింది. 2005లో ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో జరిగిన టోర్నీలో మిలిందా జింక్‌పై గెలిచి తొలి టైటిల్‌ను ఇవనోవిక్ అందుకుంది.

వెబ్దునియా పై చదవండి