మాకు అవమానం జరిగింది.. వైదొలుగుతాం: వెయిట్ లిఫ్టర్లు

PTI
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ ఆతిథ్యమిస్తోన్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ ఆరంభోత్సవంలో తమకు అవమానం జరిగిందని, అందుచేత కామన్వెల్త్ క్రీడా పోటీల నుంచి వైదొలగుతామని పాకిస్థాన్ వెయిట్ లిఫ్టర్లు మొండికేసుకుని కూర్చున్నారు.

కామన్వెల్త్ గేమ్స్ క్రీడల ప్రారంభోత్సవంలో పాకిస్థాన్ జాతీయ పతాకాన్ని మోసే విషయంలో ఆఖరి నిమిషంలో జరిగిన మార్పు దుమారానికి తెరలేపింది. అయితే అధికారులు జోక్యం చేసుకుని ‘అపార్థాలను’ తొలగించడంతో పాకిస్థాన్ వెయిట్‌లిఫ్టర్లు శాంతించారు. మెల్‌బోర్న్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన షుజాయుద్దీన్ మాలిక్ ఆదివారం రాత్రి జరిగిన కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవంలో పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని మోస్తూ ఆ దేశ క్రీడాకారులకు నేతృత్వం వహించాల్సి ఉంది.

అయితే చివరి నిముషంలో జరిగిన మార్పు వల్ల పాకిస్థాన్ చెఫ్ డి మిషన్ ఆ దేశ జాతీయ పతాకాన్ని మోస్తూ ఆ దేశ క్రీడాకారులకు నేతృత్వం వహించారు. ఇది తమ వెయిట్‌లిఫ్టర్లకు జరిగిన అవమానమని, అందువల్ల వారు కామన్వెల్త్ క్రీడల పోటీల్లో పాల్గొనాలని కోరుకోవడం లేదని పాకిస్తాన్ వెయిట్‌లిఫ్టింగ్ కోచ్ షేక్ రషీద్ పేర్కొన్నట్టు పాకిస్తాన్‌కు చెందిన ‘ద డాన్’ ప్రచురించింది.

షా క్షమాపణ చెబితేనే తమ వెయిట్‌లిఫ్టర్లు పోటీల్లో పాల్గొంటారని, లేకుంటే పాకిస్తాన్‌కు తిరిగి వస్తారని రషీద్ అల్టిమేటం జారీ చేశారు. అయితే అధికారులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి కుదుటపడింది.

వెబ్దునియా పై చదవండి