వివాహం తరువాత టెన్నిస్‌కు వీడ్కోలు: సానియా

FILE
భారత స్టార్ క్రీడాకారిణి, హైదరాబాదీ అమ్మడు సానియా మీర్జా తన కెరీర్‌కు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. వివాహం తరువాత టెన్నిస్‌కు వీడ్కోలు చెబుతానని వెల్లడించింది. పెళ్లి జరిగాక అంతర్జాతీయ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాననీ, అయితే వివాహానికి ఇంకా సమయం ఉందని సానియా పేర్కొంది. అయితే పెళ్లి ఎప్పుడు జరుగుతుందో ఖచ్చితమైన తేదీని మాత్రం ఆమె చెప్పలేదు.

గత ఏడు సంవత్సరాల నుంచి ప్రెఫొషనల్ టెన్నిస్ ఆడుతున్నాననీ, టాప్-100లో కొనసాగుతున్నానని సానియా ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేసింది. కేవలం కొన్ని టోర్నమెంట్‌ల ద్వారానే ప్రతిభను అంచనా వేసే దశను ఎప్పుడో దాటిపోయానని చెప్పింది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్ ఆడే 220 దేశాలలో ఆడే టెన్నిస్‌లోని టాప్-10 క్రీడాకారిణులను తప్పిస్తే మిగతా వారికి స్థిరంగా విజయాలు సాధించటం సాధ్యం కాదని సానియా అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే.. గత సంవత్సరం జూలై నెలలో తన చిన్ననాటి స్నేహితుడు సోహ్రాబ్ మీర్జాతో సానియా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సానియా ప్రకటన గురించి ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా మాట్లాడుతూ.. పెళ్లి అయ్యాక ఆమె మళ్లీ రాకెట్ పట్టాలనుకుంటే అది ఆమె ఇష్టమని అన్నాడు. అదే విధంగా సోహ్రాబ్ సైతం సానియా కెరీర్ నిర్ణయాన్ని పూర్తిగా ఆమెకే వదిలేస్తున్నట్లు చెప్పటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి