ఒలింపిక్స్ పోటీల్లో బంగారు పతకం గెలిస్తే రూ.7 కోట్లు ఇస్తాం : సీఎం చంద్రబాబు

ఠాగూర్

సోమవారం, 4 నవంబరు 2024 (19:09 IST)
ఒలింపిక్స్ పోటీల్లో బంగారు పతకం గెలిచే క్రీడాకారుడికి రూ.7 కోట్ల నగదు బహుమతి ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సోమవారం రాష్ట్ర కొత్త క్రీడా విధానంపై ఆయన సమీక్ష చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్రీడా పోటీల్లో పతకాలు సాధించే వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తే క్రీడల పట్ల అందరికీ ఆసక్తి పెరుగుతుందన్నారు. ఒలింపిక్స్ బంగారు పతకం సాధించిన వారికి ఇప్పటివరకు రూ.75 లక్షలు ఇస్తుండగా, ఈ మొత్తాన్ని ఇకపై రూ.7 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. 
 
అలాగే, రజత పతకం సాధించిన వారికి రూ.5 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.30 లక్షల స్థానంలో రూ.3 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. వరల్డ్ చాంపియన్ షిప్, వరల్డ్ కప్పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.35 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు. జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధిస్తే రూ.10 లక్షలు, రజతం విజేతలకు రూ.5 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ.3 లక్షలు చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతి అందజేస్తామన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు