హాలేలో కుర్ర ఆటగాడి చేతిలో ఓడినా పర్లేదు.. వింబుల్డన్‌పై దృష్టిపెడతా: ఫెదరర్

సోమవారం, 20 జూన్ 2016 (17:25 IST)
హాలే ఓపెన్ టోర్నీలో రాణించలేకపోయినా వింబుల్డన్‌పై దృష్టి సారిస్తానని స్విజ్ మాస్టర్, టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అన్నాడు. టెన్నిస్‌లో యువకుల ఆటతీరు మెరుగ్గా ఉందని.. వారితో ఆడటం కొత్త అనుభూతినిస్తోందని రోజర్ ఫెదరర్ చెప్పాడు. హాలే ఓపెన్‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా అనామక టీనేజర్ చేతిలో ఫెదరర్ ఖంగుతిన్నాడు. 
 
జవ్ రేవ్ అనే టీనేజర్ ఫెదరర్‌ను 7-6, 5-7, 6-3 తేడాతో మట్టికరిపించాడు. తొలి హాలే టోర్నీ ఆడుతున్న జవ్ రేవ్ తన పదునైన వ్యాలీలు, ఏస్‌లతో ఫెదరర్‌కు చుక్కలు చూపించాడు. అంతిమంగా గెలుపును నమోదు చేసుకున్నాడు. గత మూడు హాలే టోర్నీల్లో విజేతగా నిలిచిన రోజర్ ఫెదరర్‌కు ఈ ఓటమి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక ఫెదరర్‌పై గెలుపును నమోదు చేసుకున్న జవ్ రేవ్ ఫైనల్ మ్యాచ్‌లో థీయమ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. 
 
ఇకపోతే.. హాలే ఓపెన్‌లో కుర్ర ఆటగాడి చేతిలో ఓటమి పాలైనా... వింబుల్డన్‌ టోర్నీకి సిద్ధమవుతున్నానని.. ఈ అనుభవం ఆ బిగ్ టోర్నీకి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నాడు. వింబుల్డన్ టైటిల్‌ను ఎనిమిదో సారి కైవసం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు.

వెబ్దునియా పై చదవండి