చెన్నపురి గడ్డపై గురువారం నుంచి ప్రపంచ చందరంగ పోటీలు ప్రారంభంకానున్నాయి. 44వ చెస్ ఒలింపియాడ్ పోటీను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో కలిసి ప్రారంభిస్తారు. నిజానికి ఈ పోటీలు రష్యా వేదికగా జరగాల్సివుంది. కానీ, ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా దండయాత్రకు దిగడంతో ఈ చందరంగ పోటీల నిర్వహణ ఆతిథ్య హక్కులను రష్యా కోల్పోయింది. ఫలితంగా భారత్‌కు అనూహ్యంగా ఈ హక్కులు వరించాయి.
పైగా, ఈ పోటీలను చెన్నపురి గడ్డపై నిర్వహించేందుకు తమిళనాడు ప్రభుత్వం అమితాసక్తిని ప్రదర్శించింది. మాజీ వరల్డ్ చాంప్, గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సహకారంతో ఈ పోటీల నిర్వహణ ఆతిథ్య హక్కులను కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో మొత్తం 190 దేశాలకు చెందిన 2500 మంది స్త్రీపురుష క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో భారత్ రెండు విభాగాల్లో మూడేసి చొప్పున భారత్ ఆరు జట్లను బరిలోకి దించుతుంది.
వీరిలో తెలుగు తేజాలు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, అర్జున్ ఎరిగైసి వివిధ జట్లలో కీలక క్రీడాకారులుగా బరిలోకి దిగుతున్నారు. ఓపెన్ విభాగంగా హరికృష్ణ, అర్జున్, విదిత్, నారాయణన్, శశికిరణ్‌లతో కూడిన 'ఎ' జట్టు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది.
ఇకపోతే, హంపి, హారిక, వైశాలి, తానియా, భక్తిలతో కూడిన మహిళల 'ఎ' జట్టుకు కూడా పతకావకాశాలున్నాయి. 'సి' జట్టులోని బొడ్డ ప్రత్యూష, సాహితి కూడా తెలుగమ్మాయిలే. ఇటీవల ప్రపంచ ఛాంపియన్ కార్ల్‌సన్‌పై సంచలన విజయాలు సాధించిన యువ క్రీడాకారుడు ప్రజ్ఞానానంద.. 'బి' జట్టులో ఉన్నాడు.
అయితే, ఈ పోటీల్లో కరువానా, అరోనియన్, వెస్లీ, సామ్ షక్లాండ్, డొమినిగెజ్‌లతో కూడిన అమెరికా జట్టు పురుషుల విభాగంలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. టోర్నీలో అత్యుత్తమ ఎలో రేటింగ్ సగటు (2771) ఆ జట్టుదే. రష్యా, చైనా బరిలో లేకపోవడంతో స్వర్ణానికి అమెరికా బలమైన పోటీదారుగా మారింది. భారత్‌కు పసిడి రేసులో పెద్ద అడ్డంకి ఆ జట్టే. ఇంకా ఉక్రెయిన్, హంగేరీ, నార్వే కూడా బలమైన జట్లతో బరిలోకి దిగుతున్నాయి. ప్రపంచ ఛాంప్ కార్ల్‌సన్ నార్వే జట్టుకు ఆడుతున్నాడు.
ఈ పోటీలు స్విస్ లీగ్ ఫార్మాట్‌లో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 11 రౌండ్లు ఉంటాయి. ప్రతి రౌండ్లో ఒక జట్టు తరపున నలుగురు ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టులోని నలుగురితో తలపడతారు. గేవ్ వ్యవధి 90 నిమిషాలు. అందులో 40 ఎత్తులు వేయాలి. నిర్ణీత కాలవ్యవధిలో ఫలితం తేలకుంటే అదనంగా 30 నిమిషాలు కేటాయిస్తారు. 11వ రౌండ్ పూర్తయ్యేసరికి జట్ల మధ్య పాయింట్లు సమానమైతే టైబ్రేక్ ద్వారా విజేతను నిర్ణయించారు.
ఈ పోటీలకు చెన్నై నగరానికి 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాబలిపురం వేదిక అయింది. అయితే, చెస్ ఒలింపియాడ్ ప్రారంభ, ముగింపు వేడుకలు మాత్రం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. గురువారం ప్రారంభవేడుకల్లో ప్రధాని మోడీతో పాటు పలువురు రాజకీయ నేతలు పాల్గొంటున్నారు. అయితే, ఫోర్ పాయింట్స్ వేడుకలను బే షెరటాన్ హోటల్‌లో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.