పారిస్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌లో టోర్నీలో భాగంగా, గురువారమైన ఐదో రోజు కూడా ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. అంచనాలకు అనుగుణంగా రాణించిన టాప్‌సీడ్ ప్లేయర్లందరూ మూడోరౌండ్‌లోకి ప్రవేశించారు. కెరీర్‌లో రెండో ఫ్రెంచ్ టైటిల్ కోసం వేట మొదలుపెట్టిన స్పెయిన్ క్రీడాకారిణి గాబ్రియేల్ ముగురుజా మరో అడుగు ముందుకేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండోరౌండ్‌లో మూడోసీడ్ ముగురుజ 6-4, 6-3తో ఫియోనా ఫెర్రో (ఫ్రాన్స్)పై గెలిచి మూడోరౌండ్‌లోకి అడుగుపెట్టింది.
అలాగే, పురుషుల సింగిల్స్ రెండోరౌండ్‌లో టాప్‌సీడ్ నాదల్ (స్పెయిన్) 6-2, 6-1, 6-1తో గుడియో పెల్లా (అర్జెంటీనా)పై గెలిచి మూడోరౌండ్‌లోకి దూసుకెళ్లాడు. తొలిసెట్‌లో నాలుగు బ్రేక్ పాయింట్లను కాచుకున్న స్పెయిన్ బుల్ వరుసగా 9 గేమ్‌లను గెలిచాడు. మ్యాచ్ మొత్తం సాధారణమైన సర్వీస్‌లనే కొట్టిన నాదల్.. చివరి రెండు సెట్లలో మాత్రం మరింత దూకుడుగా ఆడాడు.
ఇకపోతే, పురుషుల డబుల్స్‌లో భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన చూపెడుతున్నారు. రెండోరౌండ్‌లో 13వ సీడ్ బోపన్న-రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) 6-1, 6-2తో బెంజిమెన్ బోంజి-జార్జ్ జాక్ (ఫ్రాన్స్)పై గెలిచి మూడోరౌండ్‌లోకి ప్రవేశించారు. 48 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-ఫ్రాన్స్ జంట 4 ఏస్‌లతో చెలరేగింది. మ్యాచ్‌మొత్తంలో ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం విశేషం.