ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో టైటిలే లక్ష్యంగా భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి ఆధ్వర్యంలోని భారత ఫుట్‌బాల్ జట్టు ఆదివారం కెన్యాతో తలపడనుంది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో జాతీయ జట్టుకు అత్యధిక గోల్స్ సాధించిపెట్టిన వారిలో మూడో స్థానంలో ఉన్న ఛెత్రి.. ఆడిన మూడు మ్యాచ్‌లలో తనదైన ముద్రను వేస్తూ గోల్స్ సాధించడం భారత్‌ను టైటిల్ ఫేవరెట్‌గా నిలిపింది.
పైగా, ఫైనల్స్‌కు టిక్కెట్లన్నీ అమ్ముడవడంతో ప్రేక్షకుల మద్దతుకూడా భారత్‌లో ఆత్మవిశ్వాసం నింపుతుంది. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్న ఏఎఫ్సీ ఆసియన్ కప్‌కు సన్నాహకంగా ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తోంది. లీగ్ దశలో కెన్యాను 3-0తో ఓడించడంకూడా భారత్‌కు కలిసొచ్చే అంశం.
అయితే న్యూజిలాండ్‌ను 2-1, చైనీస్ తైపీని 3-0తో ఓడించిన కెన్యాను తేలికగా తీసుకోవడం లేదని భారత కోచ్ స్టీఫెన్ కాన్‌స్టాంటైన్ తెలిపాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రెండు మార్పులు చేయడంతో భారత్ 1-2 తేడాతో ఓడిపోయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఫైనల్లో ఎలాంటి ప్రయోగాలు చేయడంలేదన్నాడు.