మరియా షరపోవా శకం ముగిసినట్టేనా.. రష్యా టెన్నిస్ ఫెడరేషన్ చీఫ్ ఏమంటున్నారు?

శుక్రవారం, 20 మే 2016 (17:45 IST)
నిజంగా ఇది కేవలం రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా అభిమానులకే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెన్నిస్ ఫ్యాన్స్‌కు చెడు వార్తే. డ్రగ్స్ తీసుకున్నట్టు ఆరోపణలు రావడంతో మరియా షరపోవా యాంటీ డోపింగ్ ప్యానెల్ ఎదుట హాజరైన విషయం తెల్సిందే. దీనిపై రష్యా టెన్నిస్ ఫెడరేషన్ చీఫ్ షమిల్ తపిచెవ్ మాట్లాడుతూ మరియా షరపోవా దయనీయ స్థితిలో ఉందన్నారు. యాంటీ డోపింగ్ టెస్ట్ తర్వాత ఆమె తిరిగి టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టడం సందేహమేనని అభిప్రాయపడ్డారు. 
 
ఐదు గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన మరియా షరపోవా వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నిషేధించిన ఉత్ప్రేరకం మిల్డోనియంను తీసుకున్నందుకు గాను గత బుధవారం లండన్‌లోని యాంటీ డోపింగ్ ప్యానెల్ ఎదుట హాజరైన విషయం తెల్సిందే. ఈ టెస్ట్ పరీక్ష పాజిటివ్‌గా రావడంతో టెన్నిస్ లోకం ఒక్కసారి షాక్‌కు గురైంది. 
 
టెన్నిస్ మ్యాచ్‌ల సమయంలో శారీరక నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు మరియా షరపోవా ఈ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నారు. ఇది ఇపుడు ఆమె కెరీర్‌కు ప్రతిబంధకంగా మారింది. ఈ ఉత్ప్రేరకం తీసుకున్నట్టు నిర్ధారణ అయితే, నాలుగేళ్ళ పాటు నిషేధం విధించే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి