రోజుకు రూ.120 ఖర్చు.. పేదరికంతో కష్టాలు.. హ్యాండ్‌బాల్ క్రీడాకారిణి ఆత్మహత్య.. కోచే కారణమని?

ఆదివారం, 21 ఆగస్టు 2016 (12:00 IST)
రియో ఒలింపిక్స్‌లో తెలుగమ్మాయి పీవీ సింధు పతకం సాధించి ఇతర క్రీడాకారులకు ఆదర్శంగా నిలిస్తే.. ఉచిత హాస్టల్‌ సదుపాయం లేకపోవడంతో మనస్తాపం చెంది ఓ జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ క్రీడాకారిణి ఆత్మహత్యకు పాల్పడింది. పేదరికంతో బాధపడుతున్న తనలాంటి వాళ్లను ఆదుకోవాలని ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ లేఖ రాసి, ఆత్మహత్యకు పాల్పడింది. 
 
వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కు చెందిన జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ క్రీడాకారిణి పూజ పటియాలాలోని ఖల్సా కాలేజీలో చదువుతోంది. కానీ స్పోర్ట్స్ కోటా కింద ఆమెకు అడ్మిషన్‌తో పాటు తొలి సంవత్సరం ఉచిత హాస్టల్ సదుపాయం కల్పించారు. ప్రస్తుతం ఆమె ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే ఈసారి ఉచిత హాస్టల్‌ సదుపాయం ఇచ్చేందుకు కళాశాల యాజమాన్యం నిరాకరించింది. దీంతో ఆమె ఇంటి నుంచి కాలేజీకి రావాల్సి వస్తోంది. ఇందుకు రోజుకు రూ.120 ఖర్చవుతోంది.
 
పేదరికం కారణంగా ఆమె తండ్రికి ఆర్థికభారం పెరిగిపోవడంతో మనస్తాపం చెందిన పూజ ఆత్మహత్య చేసుకుంది. తనకు హాస్టల్‌ వసతి కల్పించకపోవడానికి కారణం తన కోచేనని.. అందువల్లే తాను చనిపోతున్నానని పూజ సూసైడ్‌నోట్‌లో పేర్కొంది. దీంతో పూజ తండ్రి ఆమె కోచ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఖల్సా యాజమాన్యం మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. క్రీడలో వెనుకబడిపోవడం వల్లే పూజకు ఉచిత హాస్టల్‌ వసతి కల్పించలేదని యాజమాన్యం పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి