రియో ఒలింపిక్ క్రీడల పట్ల మొన్నటివరకూ భారతదేశ క్రీడాభిమానులకు పెద్దగా ఆశలేమీ లేవు కానీ సాక్షి మాలిక్ రెజ్లింగ్ లో కాంస్యం సాధించిన తర్వాత అంతా ఒక్కసారి అటు చూశారు. ఇప్పుడు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగుతేజం పీవీ సింధు సెమీఫైనల్ లోకి దూసుకువెళ్లడంతో ఆమె స్వర్ణపతకం సాధిస్తుందన్న నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.
గురువారం నాడు సింధు బ్యాడ్మింటన్ కోర్టులో ప్రత్యర్థిని అడ్డుకునేందుకు చిరుతలా పోరాడింది. ఆమె ప్రత్యర్థిని గుక్కతిప్పుకోలేని షాట్లతో కుదేలు చేసింది. ఒలింపిక్ క్రీడల్లో పతకాల కోసం భారత్ ఎదురుతెన్నులు చూస్తున్న సమయంలో పి.వి.సింధు భారత్‌కు రెండో పతకాన్ని ఖాయం చేసి క్రీడాభిమానులకు హుషారెత్తించింది. అంతకుముందు ఒలింపిక్ క్రీడల్లో మహిళల సింగిల్స్ విభాగంలో గ్రూప్ ఎంలో కెనడాకు చెందిన మిషెల్లీ లీ ను 2-1 తేడాతో ఓడించింది. హంగరీకి చెందిన లారా సరోసీని 2-0 తేడాతో ఓడించి 16వ రౌండులో చైనీస్ తాయ్ జూ యింగ్ పైన 2-0 తో గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.
ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్ ఇహాన్‌ను 2-0 పాయింట్ల తేడాతో మట్టికరిపించింది. ఫలితంగా ఆమె సెమీ ఫైనల్‌కు చేరుకుంది. గురువారంనాడు జరిగిన సెమీ ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారిణి నొజోమి ఒకుహరాతో వీరోచితంగా పోరాడి 2-0తో ఆమెపై విజయం సాధించింది. ఇప్పుడు ఆమె స్వర్ణ పతకం సాధించడం ఖాయమని సచిన్ టెండూల్కర్ సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.