ట్రిపుల్‌ ట్రిపుల్‌ సాధించిన తొలి అథ్లెట్‌గా జమైకా చిరుత ఉసేన్ బోల్ట్

శనివారం, 20 ఆగస్టు 2016 (15:44 IST)
జమైకా చిరుతగా పేరుబడిన ఉసేన్ బోల్ట్‌ ఖాతాలో మూడో స్వర్ణం లభించింది. రియో ఒలింపిక్స్ క్రీడల్లో మూడు ఈవెంట్లలో బంగారు పతకాలను కైవసం చేసుకున్నాడు. పురుషుల 400 మీటర్ల రిలేలో అసఫా పావెల్‌, బ్లేక్‌, అస్మెది, బోల్ట్‌తో కూడిన బృందం విజయం సాధించింది. దీంతో బోల్ట్‌ 100 మీ, 200మీ, 400 మీ. రిలేలో వరుసుగా మూడుసార్లు స్వర్ణం సాధించినట్లైంది.
 
పురుషుల 400 మీటర్ల రిలేను వరుసగా మూడుసార్లు సాధించిన రెండో అథ్లెట్‌గా బోల్ట్‌ రికార్డు సృష్టించాడు. గతంలో 1928, 1932, 1936లో అమెరికాకు చెందిన ఫ్రాంక్‌ వైకాఫ్‌ మాత్రమే ఈ ఘనతను సాధించాడు. జమైకా బృందం 37.27 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని స్వర్ణాన్ని సాధించింది. జపాన్‌ బృందం 37.60 సెకన్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. కెనడా 37.64 సెకన్లతో తృతీయ స్థానం సాధించింది.
 
ఇక ట్రిపుల్‌ ట్రిపుల్‌ సాధించిన తొలి అథ్లెట్‌గా బోల్ట్‌ చరిత్ర సృష్టించాడు. వరుసగా మూడు ఒలింపిక్స్‌లో 100మీ, 200మీ, 400 మీ రిలేలో స్వర్ణం సాధించిన అరుదైన ఘనతను అందుకున్నాడు. 29ఏళ్ల బోల్టుకు ఇదే చివరి ఒలింపిక్స్‌ కావచ్చని భావిస్తున్నారు. దీంతోపాటు తొమ్మిది స్వర్ణాలు సాధించిన అథ్లెట్లు కార్ల్‌ లూయిస్‌(యూఎస్‌ఏ), పావో నుర్మీ( ఫిన్లాండ్‌) సరసన ఈ జమైకా చిరుత చేరింది. 

వెబ్దునియా పై చదవండి