గతంలో రష్యన్ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా నిషేధిత ఉత్ప్రేరకాలను వినియోగించి అడ్డంగా బుక్కైన నేపథ్యంలో.. టెన్నిస్ ప్రపంచంలో తిరుగులేని మహిళా క్రీడాకారిణులుగా పేరొందిన అమెరికా నల్ల కలువలు సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ నిషేధిత ఉత్ప్రేరకాలను వాడారని రష్యాకు చెందిన 'ఫ్యాన్సీ బీరర్స్' హ్యాకర్లు డాక్యుమెంట్ల సాక్ష్యంతో బయట పెట్టేశారు.
వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ అసోసియేషన్) వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన రష్యన్లు, అందులోని డేటాబేస్ వివరాలు పరిశీలించి, ఎంతోమంది అమెరికన్లు నిషేధం అమలవుతున్న ఉత్ప్రేరకాలు వాడుతున్నారని, అయినా, వారందరినీ ఆటలకు అనుమతిస్తున్నారని వెల్లడించారు. ఇంకా ఒలింపిక్స్‌లో నాలుగు బంగారు పతకాలు సాధించిన సిమోన్ బైల్స్ కూడా డ్రగ్స్ ఉపయోగించినట్లు హ్యాకర్లు తెలిపారు.
కాగా, ఈ ఆరోపణలపై స్పందించిన వాడా, తమ అధికారిక వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైందని, క్రీడాకారులు గాయపడినప్పుడు వినియోగించే మందుల్లో కొన్ని నిషేధితాలు ఉంటాయని, నిబంధనల దృష్ట్యా, అనివార్యమైన వేళ, వీటిని డాక్టర్లు సూచన మేరకు తీసుకోవచ్చని తెలిపింది.