హైదరాబాదీ ఏస్ షట్లర్ పీవీ సింధు మరో టైటిల్‌పై గురి పెట్టింది. మంగళవారం ప్రారంభం కానున్న సింగపూర్ సూపర్ సిరీస్‌లో సింధు టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ కు సన్నద్ధమౌతున్న సైనా నెహ్వాల్ ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. అంతర్జాతీయ సర్క్యూట్‌లో మెరుగైన ప్రదర్శనకు శిక్షణ కోసం తనకు మరింత సమయం కావాలని సైనా తెలిపింది.
ఇక మలేషియా ఓపెన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించగా, ఈ టోర్నీలో సత్తా చాటాలని ప్రపంచ రెండో ర్యాంకర్ సింధు గట్టి పట్టుదలతో ఉంది. అయితే అగ్రస్థాయి షట్లర్లు కరోలినా మారిన్ (స్పెయిన్), ప్రపంచ నెంబర్ వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ), అకానె యమగుచి (జపాన్), సంగ్ జి హ్యున్ (కొరియా)తో సింధుకు సవాల్ ఎదురుకానుంది. ఇండియన్ ఓపెన్ విజేత సింధుకు కఠిన డ్రా ఎదురైంది.