ఫిఫా వరల్డ్ కప్ : ఇంగ్లండ్‌కు షాకిచ్చిన క్రొయేషియా

గురువారం, 12 జులై 2018 (09:19 IST)
ఫిఫా వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా బుధవారం అర్థరాత్రి జరిగిన రెండో సెమీ ఫైనల్ పోటీలో ఇంగ్లండ్‌కు క్రొయేషియా తేరుకోలేని షాకిచ్చింది. ఈ విజయంతో క్రొయేషియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని లుజ్నికీ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ పోరులో ఇంగ్లండ్‌పై 2-1 గోల్ఫ్ తేడాతో క్రొయేషియా విజయం సాధించింది. దీంతో తొలిసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ చేరిన జట్టుగా క్రొయేషియా రికార్డు సృష్టించింది. ఇక, ఈ ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో క్రొయేషియా.. ఫ్రాన్స్‌తో ఢీకొననుంది.
 
ఈ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తొలి అర్థభాగంలో ఇంగ్లండ్ దూకుడుగా ఆడింది. మ్యాచ్ మొదలైన 5వ నిమిషంలో కైరాన్ ట్రిప్పిర్ కొట్టిన ఫ్రీకిక్ గింగిరాలు తిరుగుతూ టాప్ కార్నర్ నుంచి క్రొయేషియా గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. మధ్యలో ఆటగాళ్లు అడ్డుగోడలా నిలబడినా.. ప్రత్యర్థి గోలీ సుబాసిచ్ అమాంతం గాల్లోకి ఎగిరినా బంతిని అడ్డుకోలేకపోయాడు. ట్రిప్పిర్‌కు అంతర్జాతీయ టోర్నీల్లో ఇదే తొలి గోల్ కావడం విశేషం. 
 
ఆ తర్వాత మ్యాచ్ 30వ నిమిషంలో గోల్‌పోస్ట్ అంచుల వద్ద హ్యారీకేన్ కొట్టిన షాట్ రీబౌండ్ అయి బయటకు వెళ్లింది. మ్యాచ్ ముందుకుసాగే కొద్ది క్రొయేషియా డిఫెన్స్ అంత అనుకూలంగా కదల్లేదు. దీంతో తొలి అర్థభాగం ముగిసేసరికి ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
 
కానీ రెండో అర్థభాగంలో సీన్ పూర్తిగా మారిపోయింది. క్రొయేషియా ప్లేయర్ పిరిసిక్ ఆట 68వ నిమిషంలో గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. ఇక మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. ఆ సమయంలో ఇంగ్లండ్‌కు షాకిచ్చింది క్రొయేషియా. 109వ నిమిషంలో మండూకిక్ గోల్ చేసి ఇంగ్లండ్‌ను ఇంటికి పంపాడు. దీంతో ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మూడో బెర్త్ కోసం ఇంగ్లండ్, బెల్జియంలు తలపడనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు