జనావళికి ఆదర్శప్రాయం 'గీతామృతం'

PNR

FileFILE
శ్రీముఖ నామసంవత్సర దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాలుగో పాదాన బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల దంపతులకు శ్రీకృష్ణుడు జన్మించాడు. అనగా.. ఆయన భూమిపై పురుడు పోసుకున్నది క్రీస్తు పూర్వం 3228 సంవత్సరంలో.

జయతు జయతు దేవో దేవకీ నందనోయం
జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః
జయతు జయతు మేఘ శ్యామలః
కోమలాంగో జయతు జయతు పృధ్వీభారనాశో ముకుందః||

తాత్పర్యం|| ఓ దేవకినందనా! ఓ వృష్ణివంశ మంగళ దీపమా! సుకుమార శరీరుడా! మేఘశ్యామ! భూభారనాశ ముకుంద! నీకు సర్వదా జయమగుగాక!

అలా జన్మించిన ఆ బాలుడు దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతూ.. తన లీలావినోదాదులచే చిరు ప్రాయం నుంచే అడుగడుగనా భక్తులను జ్ఞానోపదేశం చేస్తూ, అపారప్రజ్ఞాపాఠవాలు కలిగిన దైవాంశ సంభూతుడిగా ఎదుగుతూ వచ్చాడు. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగిలిస్తూ వెన్నదొంగగా ముద్ర వేసుకున్నాడు.

అలా వెన్నముద్దల దొంగతనములో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందట! ఈ సంఘటన వెన్న జ్ఞానానికి సంకేతంగా చెపుతుంటారు మన పెద్దలు. పెరుగును మధించగా.. మధించగా కాని వెన్న లభ్యం కాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లటి కుండను బద్దలుకొట్టి మానవులలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా చెపుకుంటారు.

అలాగే.. మరో చిన్నారి చేష్టలలో మరో సందేశాన్ని చెప్తారు. గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్లను యమునానదిలో నుంచి తీసుకుని వెళుతూ ఉంటే, రాళ్లను విసిరి చిల్లు పెట్టేవాడు. అలా ఆ కుండ మానవ శరీరము అనుకుంటే ఆ కుండ లోని నీరు అహంకారం. ఆ అహంకారం కారిపోతేనేగాని జీవికి ముక్తి లభించదని, ఇలా వారి లీలలోని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు పెద్దలు.

ఇక చిన్న తనమునుండే అనేకమంది రాక్షసులను సంహరిస్తూ దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రథసారధిగా ఉంటాడు. ఆ పాత్రలో అర్జునుడిలో నెలకొన్న అజ్ఞాననాంధకారాన్ని తొలగించడం కోసం.. తన విశ్వరూపాన్ని ప్రదర్శించి, గీతను బోధించి, తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించాడు. ఇలా కృష్ణతత్వాన్ని కొనియాడి చెప్పుటకు వేయి తలలు కలిగిన ఆదిశేషునకే సాధ్యంకాదని చెప్పగా, అట్టి శ్రీకృష్ణ భగవానుని జ్ఞానబోధతో అందించిన 'గీతామృతం' మనకు ఆదర్శప్రాయం.

వెబ్దునియా పై చదవండి