దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం ఎన్నో అవతారాలు

శుక్రవారం, 23 ఆగస్టు 2019 (12:34 IST)
పరమాత్ముడు ముఖ్యంగా సృష్టికర్త లోకంలో దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం ఎన్నో రకాలుగా అవతరిస్తాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అవతారం తర్వాత ద్వాపరయుగం ప్రారంభమవుతుంది.

రామావతారం పూర్తయి పోయిన కొంత కాలానికి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తానని తెలియజేస్తాడు. విష్ణుమూర్తి దశావతారాల్లో ఎనిమిదో అవతారం శ్రీకృష్ణుడు అవతారం. దీని వృత్తాంతం తెలుసుకుందాం…
 
మధురా నగరాన్ని యాదవ క్షత్రియ వంశానికి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు.
 
మధురా నగరాన్ని యాదవ క్షత్రియ వంశానికి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు.
 
చెల్లెలు అంటే ఎంతో ప్రేమ ఉన్న కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని పలుకుతుంది. కంసుడు దేవకిని, వసుదేవుడిని ఆడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు.

దేవకీ దేవి ఏడోసారి గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భ స్రావం అయిందని అనుకొంటారు. కొన్ని రోజులకు దేవకీ దేవి ఎనిమిదోసారి గర్భం ధరిస్తుంది.

దేవకి గర్భం నుంచి శ్రావణ శుద్ధ అష్టమినాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణీ నక్షత్ర యుక్తమైనప్పుడు జన్మిస్తాడు. పుట్టుకలోనే విశేషాంశాలు కలిగి ఉంటాడు. అరికాలిలో శంఖచక్రాలు, గదపద్మాలు, నక్షత్రంతో పలు విశేష సాముద్రికాంశాలతో జన్మిస్తాడు.
 
దివ్యమంగళ స్వరూపంతో శ్రీకృష్ణుడు జన్మించాక వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్ళలో పెట్టుకొని, చెరసాల బయట నిద్రపోతూ ఉన్న కావలి వాళ్ళను తప్పించుకొని, యమునా నది వైపు బయలు దేరుతాడు. యమునానది రెండుగా చీలిపోతుంది.

నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోద పక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుడిని విడిచి ఆ శిశువును తీసుకొని తిరిగి చెరసాలకు వస్తాడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది.

కంసుడు ఆ శిశువును తీసుకొని చంపడానికి పైకి విసరగా ఆ శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్రగద, సారంగాలతో ఆకాశంలోకి లేచిపోయి తాను యోగ మాయనని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయం అవుతుంది. దేవకీవసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లెలోని యశోదా వడిలో పెరుగుతాడు.
 
నందనంలో బాలకృష్ణుడు…
కంసుని చెరసాలలో జన్మించిన కృష్ణుడు పుట్టగానే తన తండ్రి వసుదేవునిచే రేపల్లె లోని నందుని ఇంటచేరి యశోదాదేవి ముద్దుబిడ్డగా బాల్య జీవితం గడిపాడు. పాలుతాగే ప్రాయంలో తనను చంపటానికి కంసునిచే పంపబడిన పూతన, బుడిబుడి నడకల ప్రాయంలో శకటాసురాదులను సంహరించాడు.

చిరు ప్రాయంలో యశోదకు తననోటిలో అండపిండ బ్రహ్మాండాదులను చూపి యశోదను ఆనందాశ్చర్య చకితురాలిని చేశాడు. బాల్యంలో యశోదచే నడుముకి కట్టబడిన రోలుతో రెండు మద్దిచెట్లను కూల్చి మద్దిచెట్ల రూపంలో ఉన్న శాపగ్రస్తులైన కుబేరుల కుమారులకు శాపవిమోచనం గావించాడు

అన్న బలరామునితో చేరి స్నేహితులతో గోపాలుడయ్యాడు. వేణుగానంలో అసాధారణ ప్రజ్ఞ చూపించి ఆబాలగోపాలాన్ని మంత్రముగ్ధులను గావించాడు. కాళిందీ నదిలో ఉన్న కాళీయుడి తలపై నృత్యం చేసి తాండవకృష్ణుడు అయ్యాడు.

ప్రళయకాలంలో గోవర్ధన గిరిని తన చిటికెన వేలుతో ఎత్తి రేపల్లె వాసులను ఆ గిరి కిందకు చేర్చికాపాడి రేపల్లె వాసుల మనసుల్లో భగవంతుడి స్థాయికి ఎదిగాడు. అల్లరి పనులతో అలరించి, ఆపత్కాలంలో ఆదుకుని, ధైర్యసాహసాల ప్రదర్శనతో రేపల్లెను మురిపించాడు.
 
కంసుడు నగరంలో బలరామ కృష్ణులు ఏం చేశారంటే!!
కృష్ణుని చంపడానికి కంసుడు ఒక వ్యూహం పన్ని, ఉద్ధవుని దూతగా పంపి, కృష్ణబలరాములను మధురకు రప్పించాడు. బలరామకృష్ణులు చాణూర ముష్టికులనే మల్లులను, తరువాత కంసుని వధించి తమ తాత ఉగ్రసేనుని చెర విడిపించి అతనిని రాజ్యాభిషిక్తుని గావించారు. చెరలోఉన్న తల్లిదండ్రులను వారితో పాటుగా విడిపించి ద్వారకకు తీసుకువస్తారు.
 
విద్యాభ్యాసం ఇలా..
దేవకీ వసుదేవుల కోరికపై విద్యాభ్యాసానికి సాందీపని ముని ఆశ్రమం చేరుకొని అక్కడ కుచేలుని చెలిమిని పొందారు. గురుదక్షిణగా అంతకుపూర్వమే మరణించిన గురుపుత్రుని బ్రతికించి తెచ్చి గురువుకి సమర్పించారు. సంపూర్ణ విద్యావంతుడై విద్యాభ్యాసనంతరం తన తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు.
 
పెంపుడుతల్లితో బాలకృష్ణుడు
దేవకీ వసుదేవులు కృష్ణుని తల్లిదండ్రులు. అన్న బలరాముడు. చెల్లి సుభద్ర. కాని బాల్యంలో కృష్ణబలరాములు యశోదా నందులవద్ద వ్రేపల్లెలో పెరిగారు. కృష్ణుని తమ్ముడు సాత్యకి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు