కావలసిన పదార్థాలు : తాజా శెనగపిండి... అరకేజీ నూనె... తగినంత నెయ్యి... వంద గ్రా. పంచదార... అరకేజీ బెల్లంతురుము... వంద గ్రా. జీడిపప్పు... 25 గ్రా. బాదంపప్పు... 25 గ్రా. ఎండు ఖర్జూరం... 50 గ్రా. ఎండుద్రాక్ష... 50 గ్రా. యాలకులపొడి... 25 గ్రా. పటికబెల్లం పలుకులు... ఒక టీ. పచ్చకర్పూరం పొడి... పావు టీ.
తయారీ విధానం : సెనగపిండిలో తగినన్ని నీళ్లు పోసి, బూందీపిండిలా కలపాలి. దీనిని నూనె కాగాక అందులో బూందీలాగా వేసి దోరగా వేయించి తీసివేసి, ఆరబెట్టాలి. చల్లారాక సగం బూందీని దంచి పొడిచేయాలి. బెల్లం విడిగా పాకం పట్టి ఉంచాలి. పంచదార తీగపాకం రానిచ్చి అందులో బెల్లంపాకం కలిపి యాలకుల పొడి, పచ్చకర్పూరంకూడా వేసి కలపాలి.
విడిగా మరో బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, బాదంపప్పు దోరగా వేయించాలి. వేడిపాకంలో బూందీ, బూందీపొడి, జీడిపప్పు, బాదంపప్పు, ఎండుఖర్జూరం, ఎండుద్రాక్ష, నెయ్యి పోసి బాగా కలిపి ఓ పూటంతా అలాగే ఉంచి, చల్లారనివ్వాలి. తరువాత పటికబెల్లం పలుకులు వేసి బాగా కలిపి కావలసిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. అంతే తిరుమల శ్రీవారి లడ్డూలు రెడీ..!!