స్వైన్ ఫ్లూ వైరస్ 0.08 మైక్రాన్లు: మాస్క్‌లు ఎలా అడ్డుకుంటాయి?

FILE
దేశంలో స్వైన్ ఫ్లూ శరవేగంగా విస్తరిస్తూ పోతోంది. మొన్నటి వరకూ నగరాలకే పరిమితమైన ఈ వ్యాధి క్రమంగా పట్టణాలు, గ్రామాలవైపు పరుగులు తీస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ బారినపడి మృతి చెందుతున్నవారి సంఖ్య పెరుగుతోంది.

ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా కేవలం మాస్కులను ధరించడం ఒక్కటే మార్గం కావడంతో ఇప్పుడందరూ మాస్కులనే ఆశ్రయిస్తున్నారు. అయితే మాస్కులను సరియైన పద్ధతిలో ఉపయోగించనట్లయితే ఫలితం ఉండదంటున్నారు వైద్యులు.

ఎందుకంటే ఈ స్వైన్ ఫ్లూ వైరస్ పరిమాణం 0.08 నుంచి 0.12 మైక్రాన్స్.. అంటే అది ఎంత సూక్ష్మమైనదో తెలుసుకోవచ్చు. కనుక మాస్కులను ధరించినప్పటికీ అవి సక్రమంగా ధరించకపోతే వైరస్ తేలికగా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది.

మాస్కులను ముక్కుపై నుంచి గడ్డం క్రింది భాగం వరకూ ఉండేవిధంగా ధరించాలి. కొందరు మాస్కులను ధరించినా గడ్డం కింది భాగంలో ఖాళీ కనబడుతుంటుంది. ఆ గ్యాప్‌లో నుంచి వైరస్ ప్రవేశించే అవకాశం ఉంది. ఎలాస్టిక్ ఉన్నటువంటి మాస్కులను ధరించడం వల్ల ముక్కు, నోరు భాగాలను గట్టిగా కప్పి ఉంచుతుంది. ఫలితంగా రోగి నుంచి గాలిలో ప్రయాణించి వచ్చే వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.

దగ్గినప్పుడో.. ఉమ్మినప్పుడో మాస్కులు తడిగా మారే అవకాశం ఉంది. అలా తడిసిపోయిన మాస్కులను వెంటనే తొలగించి తిరిగి కొత్త మాస్కులను ధరించాలి. అలాగే ఒకరు ఉపయోగించిన మాస్కులను మరొకరు ఉపయోగించరాదు. మాస్కులు పాడైపోయినట్లుగా కనిపించినా, నలిగిపోయినట్లుగా కనబడినా లేదంటే ధరించిన మాస్కులలో నుంచి శ్వాస తీసుకోవడం కష్టంగా తోచినా వెంటనే ఆ మాస్కులను తీసివేసి కొత్త మాస్కులను ధరించాలి.

వెబ్దునియా పై చదవండి