స్వైన్‌ఫ్లూ కారణంగా ఇద్దరు మహిళల మృతి

PTI
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న స్వైన్‌ఫ్లూ మహమ్మారి కారణంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. వీరిలో ఓ మహిళ గర్భిణీ స్త్రీ కావడం గమనార్హం. నాసిక్‌లో ఇప్పటి వరకు ఈ వ్యాధిబారిన పడి మృత్యువాత పడ్డవారి సంఖ్య ఆరుకు చేరుకుంది.

పూర్వా అనే 23 సంవత్సరాల గర్భిణీ స్త్రీ స్వైన్‌ఫ్లూ కారణంగా మృత్యువాత పడినట్లు నాసిక్ సివిల్ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు ఎ.డీ. భాల్‌సింగ్ గురువారం తెలిపారు.

అలాగే 20 సంవత్సరాలు కలిగిన మరో మహిళ దీపాలీ షిండే బుధవారంనాడు నగరపాలక సంస్థకు చెందిన డాక్టర్. జాకిర్ హుస్సేన్ ఆసుపత్రిలో చనిపోయినట్లు ఆయన వెల్లడించారు. వీరిరువురు స్థానికులేనని ఆయన వివరించారు.

మృతి చెందిన వీరిరువురు హెచ్1ఎన్1 వైరస్ బారిన పడినట్లు పూనాకు చెందిన నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తన నివేదికలో పేర్కొందని ఆయన తెలిపారు.

గతంలో ఓ వైద్యునితోపాటు నలుగురు వ్యక్తులు ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ కారణంగానే మృతి చెందారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇద్దరు మృతి చెందడంతో ఈ సంఖ్య ఆరుగురికి పెరిగిందని ఆయన అన్నారు.

ఇదిలావుండగా ప్రస్తుతం మరో ముగ్గురికి హెచ్1ఎన్1 వైరస్ సంక్రమించినట్లు ఆయన అన్నారు. ప్రస్తుతం వారికికూడా తాము చికిత్స అందజేస్తున్నామని వారు కోలుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వీలైతే వారిని రేపు డిస్చార్జ్ చేస్తామని ఆయన వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి