స్వైన్‌ఫ్లూ మృతుల సంఖ్య పన్నెండువేల పైచిలుకు

సోమవారం, 11 జనవరి 2010 (20:15 IST)
FILE
ప్రపంచాన్ని గడగడలాడించిన స్వైన్‌ఫ్లూ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 12,799కు చేరుకుంది.

నిరుడు ఏప్రిల్ నెల నుండి జనవరి ఎనిమిదవ తారీఖు వరకు తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ మహమ్మారి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 12,799లకు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అధికారులు తెలిపారు. వీరిలో అత్యధికులు అమెరికా దేశానికి చెందిన వారేనని ఆ సంస్థ తెలిపింది.

గత ఏప్రిల్ నెల నుంచి ఈ ఏడాది జనవరి వరకు ప్రపంచవ్యాప్తంగా 208 దేశాలలో ఈ మహమ్మారి వ్యాధి సోకి 12,799 మంది ప్రజల ప్రాణాలను బలికొంది. వీరిలో దాదాపు 55 శాతం మంది ప్రజలు అంటే 6880 రోగులు అమెరికా దేశానికి చెందిన వారేనని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అంతకు మునుపు జనవరి మూడున విడుదల చేసిన ప్రకటనలో ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 12,220గా ఉండింది.

స్వైన్‌ఫ్లూ మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్యలో అమెరికా ప్రథమ స్థానంలో నిలవగా తర్వాతి స్థానంలో యూరోప్ ఉంది. ఇక్కడ రోగులకు ఈ వ్యాధి చాలా త్వరగా సంక్రమిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. యూరోప్‌లో మృతి చెందిన వారి సంఖ్య 2554కు చేరుకుంది. అదే ఓ వారం ముందు ఈ సంఖ్య 2422గా ఉండిందని డబ్ల్యూహెచ్ఓ అధికారులు వివరించారు.

వెబ్దునియా పై చదవండి