కాంగ్రెస్ అభ్యర్థికి తీవ్ర అస్వస్థత : ఆస్పత్రికి తరలింపు

సోమవారం, 26 నవంబరు 2018 (09:40 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, గజ్వేల్  స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రజాకూటమి అభ్యర్థి, కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. తెరాస నేతలు పోలీసుల సహకారంతో డబ్బు పంచుతున్నారంటూ గజ్వేల్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట వంటేరు ప్రతాప్‌రెడ్డి దీక్ష చేశారు. పోలీసులు ఈ దీక్ష భగ్నం చేసే సమయంలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆయనను సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
నిజానికి గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్నారు. ఆయనతో వంటేరు తలపడుతున్నారు. అయితే, గజ్వేల్‌లో పలువురు ప్రభుత్వ అధికారులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా తెరాస నేతలకు పూర్తిగా సహకరిస్తూ విపక్ష నేతలు, కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 
 
ఈ తీరుకు వ్యతిరేకంగా ప్రతాపరెడ్డి నిరాహారదీక్షకు దిగారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, తెరాస నేతల అండతో అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారని, పోలీసులు తనను వెంబడిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు కొంతమంది అధికారుల అండతో తెరాస డబ్బు, మద్యం పంచుతోందని ఆరోపించారు. దీంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు.
 
కాగా, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నికల్లో గజ్వేల్‌ అసెంబ్లీ స్థానంలో ముఖ్యమంత్రి హోదాలో తెరాస అభ్యర్థిగా కేసీఆర్‌ బరిలోకి దిగుతుండగా మహాకూటమి అభ్యర్థిగా వంటేరు పోటీకి సై అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంటేరు ప్రతాప్‌ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. కేసీఆర్‌ చేతిలో 19,029 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు