తెలంగాణ ప్రజలు ఎన్నికల ఫలితాలపై ఏలాంటి బెట్టింగ్‌లు చేయవద్దని, బెట్టింగ్ పేరుతో మోసపోవద్దని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ చెప్పారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా లగడపాటి రాజగోపాల్ వంటి వాళ్లు ప్రజలను గందరగోళ పరిచి పైశాచికానందం పొందాలని చూస్తున్నారని, ఇలాంటి సర్వేలను నమ్మవద్దని పిలుపునిచ్చారు.
అసలు రాజగోపాల్ సర్వేను విడుదల చేసే సందర్భంగా ఆయన ముఖంలో నెత్తురు చుక్కలేదని, ఆయన మాట్లాడేటప్పుడు ఏదో కోల్పోయినట్టు ఉన్నాడని, ఆయనతో ఎవరు సర్వేలు చేయించారో, ఎవరి ప్రోద్బలం ఉందో అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ నేతలు కొందరు సర్వేల పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి జాతీయ మీడియా సహా అనేక సంస్థలు టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయాన్ని సాధించబోతోందని తేల్చి చెప్పాయన్నారు.
మరో మూడు రోజుల్లో ఫలితం తేలబోతోందని, ఈ నేపథ్యంలో అనేక కథనాలను కొంతమంది వండి వారుస్తారని, దీనివల్ల ఒరిగేదేమీ ఉండదన్నారు. 11వ తేదీన ఎవరేమిటో తేలిపోతుందని, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం టీఆర్ఎస్‌కు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలను గందరగోళ పరిచేందుకు ప్రయత్నించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని, రాబోయేది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనన్నారు.