కొల్లాపూర్ బరిలో బర్రెలక్క... ప్రధాన పార్టీ అభ్యర్థుల గుండెల్లో గుబులు...
శుక్రవారం, 24 నవంబరు 2023 (13:19 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. మరో వారం రోజుల్లో పోలింగ్ జరుగనుంది. దీంతో ఈ నెల 28వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా లక్షాధీశులు, కోటీశ్వరులుగా ఉన్నారు. కానీ, వారి గురించి పెద్దగా చర్చ సాగడం లేదు. కానీ, కుటుంబ పోషణ నిమిత్తం బర్రెలు మేపుకుంటూ బర్రెలక్కగా గుర్తింపు పొంది శిరీష ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం ఆమె కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడమే.
స్థానికంగా బర్రెలక్కగా గుర్తింపు పొంది కర్నె శిరీష్ (26) ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. కొల్లాపూర్ సెగ్మెంట్‌లో నామినేషన్ వేసిన శిరీషకు మద్దతు తెలిపే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో మిగతా అభ్యర్థులకు టెన్షన్ మొదలైంది. నిరుద్యోగుల గొంతుకగా ఎన్నికల్లో పోటీచేస్తున్న బర్రెలక్కకు బెదిరింపులు మొదలయ్యాయి. ప్రచారంలో ఆమెపై, ఆమె సోదరుడిపై దాడి జరిగింది. పోటీ నుంచి తప్పుకుంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆఫర్లు వస్తున్నాయి.
అయితే, ఈ ప్రలోభాలకు, బెదిరింపులకు, దాడులకు తాను భయపడబోనని బర్రెలక్క తేల్చి చెప్పింది. ప్రాణం పోయినా సరే పోరాటం ఆపబోనని స్పష్టం చేసింది. బర్రెలక్కపై దాడి జరగడంతో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. బర్రెలక్కకు ఓటు వేసి గెలిపించాలని కొల్లాపూర్ నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజాసంఘాల నేతలు, మేధావులు, ప్రజలు బర్రెలక్కకు అండగా నిలుస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆమె తరఫున ప్రచారం చేస్తున్నారు. దీంతో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కొల్లాపూర్ బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
కర్నె శిరీషది నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం.. తల్లి, ఇద్దరు తమ్ముళ్లతో కూడిన నిరుపేద కుటుంబం. తండ్రి వీరిని వదిలేసి వెళ్లాడు. దీంతో శిరీష తల్లి రోజు కూలీగా మారి కుటుంబాన్ని గెంటుకొస్తోంది. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూనే కుటుంబానికి ఆసరగా ఉండేందుకు శిరీష కూడా కూలీ పనులకు వెళ్లేది.
తల్లిని అడిగి నాలుగు బర్రెలను కొని, వాటి పాలు అమ్ముతూ డబ్బు సంపాదిస్తోంది. ఈ క్రమంలో ఓ రోజు తనలాంటి నిరుద్యోగుల ఆవేదనను జనాలందరికీ తెలిసేలా ఓ వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇన్‌స్టాలో సంచలనం సృష్టించింది. దేశవిదేశాల్లోని ఇన్‌స్టా యూజర్లకు ఆమెను పరిచయం చేసింది. కర్నె శిరీషను బర్రెలక్కగా మార్చేసింది.
ఈ వీడియోలు ఇపుడు వైరల్ కావడం కొందరికి కంటగింపుగా మారింది. ఫలితంగా శిరీషపై కక్ష సాధింపునకు దిగారు. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దాని కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం శిరీషకు ఇన్‌స్టాలో 5.73 లక్షల మంది, ఫేస్‌బుక్ లో 1.07 లక్షల మంది ఫాలోవర్లు, యూట్యూబ్ లో 1.59 లక్షల మంది సబ్ స్కైబర్లు ఉన్నారు.
వేధింపులపై ధైర్యంగా పోరాడుతున్న శిరీష అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకుంది. చేతిలో డబ్బులేకున్నా నిరుద్యోగుల గొంతుకగా నామినేషన్ వేసింది. అఫిడవిట్‌లో ఆమె ఆస్తుల వివరాలు.. బ్యాంక్ ఖాతాలో రూ.1,500, చేతిలో రూ.5 వేలు ఉన్నట్లు వెల్లడించింది. తనకు సపోర్ట్ చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన వీడియోకు విపరీతమైన స్పందన వచ్చింది.
కొంతమంది నేరుగా ప్రచారానికి వస్తుండగా ఇంకొంత మంది తమకు తోచిన నగదు సాయం చేస్తున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఆమెకు మద్దతుగా చాలామంది పోస్టులు పెడుతున్నారు. ప్రచారం కోసం డబ్బు సాయం, పాటలు రాసివ్వడం.. ఇలా ఏదో ఒక రకంగా మేధావులు మద్దతు తెలుపుతున్నారు.