అక్కడ మన్నార్ గుడి మాఫియా.. ఇక్కడ కుదురుపాకం మాఫియా.. కేసీఆర్‌కు ప్రాణహాని తప్పదా?

ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (02:50 IST)
ఒకవైవు మన్నార్ గుడి మాఫియా దెబ్బకు తమిళనాడు రాజకీయాలు పాలనే లేకుండా అతలాకుతలమైపోతున్నాయి. అక్కడ శశికళ దెబ్బకు అన్నాడీఎంకే కుదేలైపోయింది. ఎవరు ఎప్పుడు ఏ గ్రూపులో చేరతారో, ఎవరు సీఎం అవుతారో.. గవర్నర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో తెలియదు. పాతికేళ్లపాటు అప్రతిహతంగా తమిళనాడు రాజకీయాల్లో వెలిగిన అన్నాడీఎంకే పార్టీ ఆ శశికళ జోక్యంతో నిలువునా చీలిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణలో మరో శశికళ వల్ల సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ప్రాణహాని ఉందంటూ కేసీఆర్ అన్న కుమార్తె రేగులపాటి రమ్య ఆరోపిస్తున్నారు. కేసీఆర్ కుటుంబ కలహాల్లో విడిపోయి కాంగ్రెస్‌లో చేరిపోయిన రమ్య తమ చిన్నాన్న కోటరీ దెబ్బకు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఇరుక్కున్నారని ఆరోపించడం సంచలనం కలిగిస్తోంది.
 
సీఎం కేసీఆర్‌కు ఆయన మరదలు కుదురుపాక శశికళ నుంచి ప్రాణహాని ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్య (కేసీఆర్‌ అన్న కుమార్తె) ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌ చుట్టూ ఉన్న కోటరీతోనే ఆయనకు ప్రాణహాని ఉందన్నారు. తమిళనాడులో మాదిరి తెలంగాణలో కుదురుపాక గ్రామానికి చెందిన కొందరు మాఫియాగా ఏర్పడి కేసీఆర్‌ను పొట్టనబెట్టుకునే ప్రమాదముందన్నారు.
 

వెబ్దునియా పై చదవండి