కేసీఆర్ ఆకర్ష్ మంత్రం: తెరాసలోకి కాంగ్రెస్ జంప్ జిలానీలు

శనివారం, 29 అక్టోబరు 2011 (20:26 IST)
FILE
తెలంగాణ అంటే తెరాస అనే స్థాయికి పార్టీని లాక్కొచ్చిన కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌తో పార్టీని మెల్లిగా బలపరుచుకుంటూ వస్తున్నారు. తొలుత తెలుగుదేశం పార్టీపై గురిపెట్టిన కేసీఆర్, ఆ పార్టీ నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు తెరాస తీర్థం ఇచ్చారు.

ఇక ఇప్పుడు తాజాగా ఆయన దృష్టి తెలంగాణ కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలపై పడింది. తాజాగా తెరాసలోకి కరీంనగర్ జిల్లా రామగుండం శాసనసభ్యుడు సోమారపు సత్యనారాయణ దూకేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నానబెడుతుండటంతో తన నియోజకవర్గంలోని ప్రజల ఒత్తిళ్లకు తలొగ్గి సోమారపు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.

మరోవైపు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యలు కూడా తెరాసలోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనబడుతున్నాయి. ఇందుకోసం రాజయ్య ఆదివారం కాంగ్రెస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి.

మరోవైపు మంత్రిపదవికి రాజీనామా చేసి నవంబరు 1న దీక్ష చేపట్టనున్న కోమటిరెడ్డి కూడా తెరాస తీర్థం పుచ్చుకుంటారన్న వాదనలు వినబడుతున్నాయి. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీపై డైరెక్టుగా విమర్శలకు పాల్పడుతున్న తెలంగాణ ప్రాంత ఎంపీలు కొందరు తెరాస తీర్థాన్ని పుచ్చుకునేందుకు ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు చెపుతున్నారు. మొత్తమ్మీద తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను ఖాళీ చేసి తెరాస మాత్రమే ఉండేటట్లు కేసీఆర్ గట్టి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి