కేసీఆర్ వ్యూహం తెలంగాణా కోసమా.. పార్టీ కోసమా?

సోమవారం, 17 అక్టోబరు 2011 (14:22 IST)
FILE
ఇపుడు ఇదే సందేహం తలెత్తుతోంది. ఒకవైపు తెలంగాణ కోసం నాయకులంతా రాజీనామాలు చేయాలంటూనే ఇంకోవైపు ఇతర పార్టీల నుంచి మెల్లిగా ఒక్కొక్క నాయకునితో రాజీనామా చేయించి, పిదప సదరు నియోజకవర్గంలో ఉపఎన్నిక నగారా మోగగానే తెలంగాణ సెంటిమెంట్ ఆయుధాన్ని వెలికి తీసి అభ్యర్థిని గెలిపించాలని చెపుతున్నారు. ఆ గెలుపుతో ఢిల్లీ ముఖం పగిలిపోవాలంటూ పౌరుషం ఉట్టపడేలా ప్రకటలు చేస్తున్నారు. ఫలితంగా తమ పార్టీ బలాన్ని, బలగాన్ని మెల్లిగా పెంచుకుంటూ ముందుకు వెళుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.

తెలంగాణ రావాలంటే రాజీనామాలు ఒక్కటే మార్గమని చెపుతున్న తెరాస, ఎన్నికల్లో పోటీ ఎందుకు చేస్తున్నట్లు..? అన్నది వారి ప్రశ్న. రాజీనామా చేసిన నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని పోటీ చేయకుండా ఎన్నికలను బహిష్కరించవచ్చు కదా..? కానీ అలా చేయట్లేదు. మెల్లిగా ఇతర పార్టీలకు చెందిన నాయకులను ఆకర్షించి వారితో రాజీనామా చేయించి పిదప వారికి తెరాస తీర్థమిచ్చి ఆనక ఉపఎన్నికలు రాగానే తెలంగాణ సెంటిమెంట్ ఆయుధంతో ఎంచక్కా గెలిపించుకుంటున్నారన్నదే వారి వాదన.

అంటే.. రాజీనామాల వల్ల తెలంగాణ వస్తుందో లేదో కానీ తెరాస మాత్రం మెల్లిగా బలపడుతూ పోతోంది. కేసీఆర్ ప్లాన్ ప్రకారం ఇలాగే ముందుకు వెళితే 2014 నాటికి క్రమంగా మిగిలిన నియోజకవర్గాల్లోనూ పాగా వేయడం ఖాయమని వారు గట్టిగానే చెపుతున్నారు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ కదా..!! జనం ఓటేస్తారు. తెలంగాణ మాట చెపితే చాలు... పార్టీతో సంబంధం లేదు. తెరాసకు గుద్దుడే గుద్దుడు. అదీ కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ఎఫెక్ట్ అనేది వారి వాదన.

వెబ్దునియా పై చదవండి