తెలంగాణపై ప్రధాని హామీ ఇవ్వలేదు.. మా పోరాటం ఆగదు

సోమవారం, 3 అక్టోబరు 2011 (22:09 IST)
FILE
తెలంగాణ ఏర్పాటుపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తమకు ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ చెప్పారు. ఉద్యమ తీవ్రతను తెలిపేందుకే ఢిల్లీ వచ్చామనీ, సకలజనుల సమ్మె వల్ల తెలంగాణ స్తంభించిపోయిన విషయాన్ని ప్రధానికి దృష్టికి తీసుక వచ్చేందుకు వచ్చామన్నారు.

ఐతే తాము చెప్పకమునుపే ప్రధాని తెలంగాణ పరిస్థితిని అంతా వెల్లడించారనీ, పరిస్థితి అలా ఉన్నప్పుడు తెలంగాణ ప్రకటించాలని కోరామన్నారు. ఐతే కొంత వ్యవధి కావాలని ప్రధాని తమతో చెప్పారని అన్నారు. ప్రధాని చెప్పినట్లుగా సమ్మె ఆపడం తమ చేతుల్లో లేదనీ, అది ప్రజల చేతుల్లో ఉంది కనుక సమ్మె ఆగాలంటే తెలంగాణ ఏర్పాటు ఒక్కటే మార్గమని తేల్చి చెప్పారు.

తెలంగాణపై రోడ్ మ్యాప్ ప్రకటించేవరకూ తమ ఉద్యమం ఆగదని స్పష్టీకరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారనీ, ఇకనైనా అటువంటి ట్రిక్స్ మానుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్ని ఇబ్బందులు పడేందుకైనా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ నెల 9,10, 11 తేదీల్లో రైల్ రోకో చేయనున్నట్లు ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి