తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దర్జాగా కుర్చీలో కూచోమని కాంగ్రెస్ నేతలకు చెపితే యాచకుల మాదిరిగా ఉపముఖ్యమంత్రి పదవికోసం తిరుగుతున్నారనీ, వీరి వల్ల తెలంగాణా రాష్ట్ర సాధ్యమవుతుందనే విశ్వాసం తనకు లేదని ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు.
తెలంగాణా రాష్ట్రం రాకపోతే మనపై దోపిడీ జరుగుతూనే ఉంటుంది. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణాకు అనుకూలంగా ఇచ్చినా లేకపోయినా రాష్ట్రం వచ్చేవరకూ ఎట్టి పరిస్థితిల్లోనూ రాజీపడేది లేదని జయశంకర్ తెలిపారు.
తెలంగాణాలోని కాంగ్రెస్ నాయకులు, తెలుగుదేశం నాయకులు యాచకులు మాదిరిగా మారినా తెలంగాణా ప్రజలు మాత్రం అలా లేరనీ, తమ హక్కులను పోరాటం ద్వారా సాధించుకు తీరుతారని అన్నారు. ఉద్యమ సాధనలో ఇంత దూరం వచ్చాక ఇక తిరిగి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
భవిష్య తరాల బంగారుమయం కావాలంటే తెలంగాణా రాష్ట్రం వచ్చి తీరాలని అన్నారు. అందుకోసం యువత నడుం బిగించాలని, పట్టు విడవని పోరాటం చేయాలన్నారు. అయితే ఆ పోరాటం ఎలా ఉంటుందో డిసెంబరు 31 తర్వాత ఉద్యమ నేతలు నిర్ణయిస్తారని తెలిపారు.