తెలంగాణా రాకపోతే కోట్లాటే మార్గం: ప్రొఫెసర్ కోదండరాం
డిసెంబరు 31 తర్వాత తెలంగాణా రాష్ట్రానికి అనుకూలంగా ప్రకటన వెలువడకపోతే కొట్లాట ఖాయమని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. వరంగల్ మహాగర్జనలో ఆయన మాట్లాడుతూ... ఈ నెలాఖరు నాటికి నివేదిక ఏం చెపుతుందో తేలిపోతుందనీ, ఒకవేళ అది వ్యతిరేకమైతే కనుక జనవరి 1 నుంచి తెలంగాణా బిడ్డలు కొట్లాటకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే ఆ కొట్లాట ఎలా ఉండాలన్నది తాము చెపుతామన్నారు.
విద్యార్థులను చూస్తేనే గడగడలాడుతున్న ఈ ప్రభుత్వం మనమందరం రోడ్లమీదకు వస్తే నడుస్తుందా అని అన్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం కొట్లాడగలమనీ, తెలంగాణాలో ఉన్నవారంతా తెలంగాణా కావాలంటున్నప్పుడు కమిటీలతో పనిలేదన్నారు.
ఈ రోజు ఎలా ఐక్యంగా ముందుకు వచ్చారో అదేవిధంగా జనవరి 1 నుంచి కొట్లాడదామని పిలుపునిచ్చారు. నాయకులను రోడ్లపై తిరగనివ్వద్దనీ, కొత్త ఏడాదిలో చేపట్టే ఉద్యమంలో తెలంగాణాలోని నాలుగు కోట్లమంది తెలంగాణా ప్రజలు భాగస్వాములవ్వాలని కోరారు.