మహబూబ్‌ నగర్‌లో మా అభ్యర్థి ఇప్పటికే గెలిచాడు: కేసీఆర్

శనివారం, 10 మార్చి 2012 (16:46 IST)
FILE
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ పదవులకు రాజీనామాలు చేసిన బిడ్డలను తెలంగాణ ప్రజలు ఎన్నుకుంటారని తెరాస చీఫ్ కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్‌లో భాజపాకు మద్దతిస్తున్నట్లు అక్కడి జిల్లా జేఏసీ ప్రకటించిన నేపధ్యంలో మీ పార్టీ అభ్యర్థి ఓడిపోతారా..? అనే ప్రశ్నకు తీవ్రంగా స్పందించారు.

తెరాస అభ్యర్థి ఇప్పటికే విజయం సాధించేశాడని చెప్పుకొచ్చారు. అక్కడి ప్రజలు సయ్యద్ ఇబ్రహీంను బంపర్ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జమాతే ఇస్లామిక్ హింద్‌తో భేటీ అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు.

మహబూబ్ నగర్‌లో తెలంగాణ జేఏసీ తెరాస లేదా భాజపాలో వేటికి మద్దతు ఇస్తుందని అడిగినప్పుడు... తెలంగాణకు మద్దతిస్తుందని అన్నారు. మొత్తమ్మీద మహబూబ్ నగర్ స్థానం తెరాస గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నట్లు కనబడుతోంది. అక్కడ కమలం తెరాస గుండెల్లో గునపంలా గుచ్చుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. తమ అభ్యర్థి గెలిచాడని కేసీఆర్ చెపుతున్నప్పటికీ అక్కడి వాస్తవ పరిస్థితులు మాత్రం వేరుగా కనబడుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి