హర్యానా రాష్ట్రంలోని సిర్సాకు చెందిన 500 మంది విద్యార్థినిలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. చౌదరి దేవీలాల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అందులో పేర్కొన్నారు. ఈ లేఖను ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు కూడా పంపించారు. తమను వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేయడంతోపాటు హైకోర్టు రిటైర్డ్ జడ్జీతో విచారణ జరిపించాలని లేఖలో వారు డిమాండ్ చేశారు.
అలాగే, ఈ లేఖ కాపీని ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు.. హోం మంత్రి అనిల్ విజ్, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ, వైస్ చాన్సలర్ డాక్టర్ అజ్మేర్ సింగ్‌తో పాటు ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు కూడా పంపించారు.
ప్రొఫెసర్ తన చాంబర్‌లోకి అమ్మాయిలను పిలిపించి అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, బాత్రూముకు తీసుకెళ్లి ప్రైవేటు భాగాలను తాకేవాడని ఆ లేఖలో విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయాన్ని బయటపెడితే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించేవాడని వాపోయారు. కొన్ని నెలలుగా ఆయనిలా ప్రవర్తిస్తున్నాడని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తంచేశారు.