రాష్ట్ర సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల ఒకరోజు సదస్సులో ఆయన ప్రసంగించారు. వ్యవసాయం, ధరణి, ఆరోగ్యం, విద్య, శాంతిభద్రతలు, మాదకద్రవ్యాల వినియోగంతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్న ఈ సమావేశానికి మొత్తం 33 జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు హాజరవుతున్నారు.
కలెక్టర్లు ప్రభుత్వానికి కళ్లు, చెవులు అంటూ మానవీయ దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల సమస్యలను గుర్తించేందుకు ప్రముఖ మాజీ ఐఏఎస్ అధికారులు ఎస్.ఆర్.శంకరన్, శ్రీధరన్ వంటి వారి అడుగుజాడల్లో నడవాలని కలెక్టర్లకు సూచించారు.
ఆరు హామీలను పారదర్శకంగా అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని, ఇది తమ ప్రభుత్వమని ప్రజలకు నమ్మకం కలిగించాలని కలెక్టర్లకు సూచించారు. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతూకంతో రాష్ట్రం ముందుకు సాగేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును పర్యవేక్షించే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలన్నారు.