ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనేక మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడులకి దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన "పద్మ విభూషణ్" పురస్కారాన్ని ప్రకటించింది. అలాగే, అనేక మంది తెలంగాణ కళాకారులకు పద్మ అవార్డులు వరించాయి. ఈ అవార్డు గ్రహీతలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఘనంగా సన్మానించింది. ఇందులో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. పద్మ అవార్డులకు అర్హులను ఎంపిక చేయడంలో కొత్త విధానం కనిపిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మట్టిలో మాణిక్యాలను గుర్తిస్తుందని కొనియాడారు. గుర్తింపు దక్కని వ్యక్తులను గుర్తించి పద్మ పురస్కారాలు ఇస్తుందని కితాబిచ్చారు.
ఇకపోతే, తెలుగు చిత్రపరిశ్రమకు దివంగత ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు రెండు నేత్రాలు అయితే, మెగాస్టార్ చిరంజీవి మూడో కన్ను వంటివారన్నారు. ఆయనకు కూడా తనతో పాటు పద్మ విభూషణ్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇష్టమైన పనిని కష్టపడి చేస్తే నష్టపోయేది ఏదీ ఉండదని, పట్టుదలకు కృషి తోడైతే ఏదైనా సాధ్యమేనని చిరంజీవి నిరూపించారన్నారు.
"నేను జీవితంలో పెద్దగా అవార్డులు తీసుకోలేదు. సన్మానాలు పొందలేదు. మీకు అవార్డు ఇస్తున్నాం అని కేంద్రం చెప్పింది. మోదీ మీద గౌరవంతో అవార్డు తీసుకుంటున్నా" అని స్పష్టం చేశారు. ఇకపోతే, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు విలువలు పాటించాలని కోరారు. ఇటివలి కాలంలో పార్లమెంట్, అసెంబ్లీ వేదికలుగా జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమన్నారు.