హైదరాబాద్ నగరంలోని మెట్రో రైళ్లలోనే కాకుండా మెట్రో స్టేషన్లలో కూడా ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. నిన్నామొన్నటి వరకు మెట్రో రైళ్లలో ప్రయాణికులు తగ్గిపోయారంటూ గగ్గోలు పెట్టిన హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు.. ఇపుడు ప్రయాణికులను స్టేషన్‌లలో రానివ్వడం లేదు. స్టేషన్లలో స్థలం లేదని, విపరీతమైన రద్దీ నెలకొందంటూ స్టేషన్లను ఏకంగా మూసివేస్తున్నారు. వాన పడుతున్నా కనికరించకుండా బయటే నిలిపేయడం ప్రయాణికుల ఆగ్రహానికి కారణమవుతోంది.
గత నెల 26న జోరున వర్షం కురుస్తుండగా ఐటీ ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు రాయదుర్గం స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే ప్లాట్ ఫాంలు స్టేషన్ కాన్‌కార్స్‌లో రద్దీ నెలకొనడంలో ఇంకా వస్తున్న ప్రయాణికులను రోడ్డు మీదనే సిబ్బంది నిలిపేశారు. వాన పడుతుంది కనీసం మెట్లమీదైనా నిలబడతాం.. అని బతిమాలినా అనుమతించలేదు. దీంతో ప్రయాణికులు మెట్రో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. స్టేషనులో వేచి చూసేందుకు తగిన స్థలం లేకపోవడంపై ప్రయాణికుల నుంచి విమర్శలు వస్తున్నాయి.