ఆయన మా డాడీయే కావొచ్చు.. కానీ ఈ యాత్రలో ఆయన ఫోటోను వాడను : కవిత

ఠాగూర్

బుధవారం, 15 అక్టోబరు 2025 (16:13 IST)
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన తండ్రి అయినప్పటికీ తాను చేపట్టిన రాష్ట్ర యాత్రలో ఆయన ఫోటోను మాత్రం ఉపయోగించబోనని  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ నగరంలో ఆమె జాగృతి జనం బాట అనే యాత్ర పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ కోసం నిలబడినందుకే తనపై కుట్రలు చేసి బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించారని ఆమె అన్నారు. 
 
ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు రావాలని పిలుపునివ్వడం తప్పా అని ఆమె ప్రశ్నించారు. భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ, సామాజిక తెలంగాణాను ఇంకా సాధించలేకపోయామని ఆమె వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయని అనేక మంది ప్రాణత్యాగం చేశారన్నారు. కానీ, అది రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదన్నారు. 
 
తాను చేపట్టిన యాత్ర నాలుగు నెలల పాటు సాగుతుందన్నారు. ఈ యాత్రలో భాగంగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు చాలా తెలివైనవారని, వారికి అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుందన్నారు. యువత, మహిళలను మరింత చైతన్యవంతులను చేస్తామన్నారు. మరోవైపు, కవిత ఆవిష్కరించిన తన యాత్ర పోస్టరుపై తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. తన తండ్రి కేసీఆర్ ఫోటో లేకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి