ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై రూ.15 కోట్ల అప్పు.. విదేశాలకు పారిపోతూ అరెస్టు...

ఠాగూర్

మంగళవారం, 12 మార్చి 2024 (09:28 IST)
ఆన్‌‍లైన్ గేమ్స్‌కు బానిసైన ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకరు ఏకంగా రూ.15 కోట్ల మేరకు అప్పు చేశాడు. ఈ మొత్తాన్ని 37 మంది కాంట్రాక్టుల నుంచి వసూలు చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనులను కట్టబెట్టేలా సహకరిస్తానని నమ్మించి రూ.15 కోట్ల మేరకు అప్పు చేశాడు. ఆయనకు పలువురు ఉన్నతాధికారులు కూడా సహకరించారు. ఈ విషయం తెలిసిన ప్రభుత్వం ఏఈని ఆరు నెలల క్రితమే సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న... విదేశాలకు పారిపోతూ ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసుల చేతికి చిక్కారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తెలంగాణ రాష్ట్రంలోని కీసర మండలం మిషన్ భగీరథ ఏఈగా రాహుల్ పని చేశాడు. ఈయన ఆన్‌లైన్ క్రీడకు బానిసయ్యాడు. అందిన చోటల్లా భారీగా అప్పులు చేశాడు. పనులు ఇప్పిస్తానని కాంట్రాక్టర్లను నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. విజయం కాస్తా ఉన్నతాధికారులకు చేరడంతో ఆరు నెలల క్రితం సస్పెండ్ చేసినప్పటికీ విషయం రహస్యంగానే ఉండిపోయింది. రాహుల్‌కు సహకరించిన అదే శాఖలోని ఉన్నతాధికారులు, ఇతర ఉద్యోగులుపైనా వేటుపడింది. 
 
ఈ క్రమంలో 37 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.15 కోట్లకు పైగా అప్పు చేసిన రాహుల్ వాటిని తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాహుల్ కోసం గాలించగా, ఆయన పరారీలో ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో ఆయన దేశం సరిహద్దులు దాటివెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఈ క్రమంలో సోమవారం ఢిల్లీ నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించగా, ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని కీసర పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రాహుల్‌ను తమ అదుపులోకి తీసుకున్న కీసర పోలీసులు.. విచారణ ప్రారంభించారు. రాహుల్ భార్య, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. దీంతో రాహుల్ చేసిన అప్పులు తీరుస్తామని తొలుత హామీ ఇచ్చి, ఆ తర్వాత వారు విస్మరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు