తెలంగాణ రాష్ట్రంలోని విపక్ష పార్టీల నేతలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఏనుగులు, సింహాలు, పులులు లేవని, ఫాంహౌస్‌లో మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయన్నారు. వాటిని పట్టుకుని బంధించాల్సి వుందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. రూ.80 కోట్లతో కొత్తగా నిర్మించిన దుందుభి, భీమ హాస్టల్ భవనాలను ప్రారంభించారు. దీంతో పాటు మరో రెండు హాస్టళ్లు, డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రొఫెసర్ కోదండరాంకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తీరుతామన్నారు. "తమ ప్రభుత్వం కోదండరాంను ఎమ్మెల్సీని చేస్తే, కొందరు పెద్ద లాయర్లను పెట్టి కోర్టులో కేసు వేసి అడ్డుకున్నారు. కేవలం 15 రోజుల్లో ఆయనను మళ్లీ చట్టసభకు పంపిస్తాం. ఎవరు అడొస్తారో చూస్తాను" అని సవాల్ విసిరారు.
ఉస్మానియాను ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటి వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల స్థాయిలో తీర్చిదిద్దడానికి రూ.1000 కోట్లు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడబోమని ప్రకటించారు. వర్సిటీ అభివృద్ధికి అవసరమైన అంచనాలు రూపొందించడానికి నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్ల నియామకంలో సామాజిక న్యాయం పాటించామని సీఎం తెలిపారు. ఓయూ 108 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఒక దళితుడిని వీసీగా నియమించామని గుర్తుచేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, చదువుతోనే తలరాతలు మారతాయని అన్నారు.