దావాస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి స్విట్జర్లాండ్‌లోని పలువురు ప్రవాస భారతీయ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం ఇచ్చి.. శాలువా కప్పి సన్మానించారు.
సోమవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు దావోస్ నగరంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు జరుగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం మణిపూర్ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తిరిగి ఢిల్లీ చేరుకుని, అర్థరాత్రి 2 గంటలకు స్విస్ ఎయిర్ లైన్స్ విమానంలో స్విట్జర్లాండ్‌కు బయలుదేరి వెళ్లారు.
ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై జరిగే అత్యున్నతస్థాయి సదస్సులో పాల్గొని అగ్రి - ఎకానమీపై వాతావరణ మార్పుల ప్రభావం, రైతుల జీవనోపాధిని పరిరక్షించేందుకు వాతావరణానికి అనుగుణంగా సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే అంశంపై రేవంత్ ప్రసంగిస్తారన్నారు.