24వ తేదీన ఇంటర్, 30న పది పరీక్షా ఫలితాలు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ విద్యాశాఖ!!

వరుణ్

ఆదివారం, 21 ఏప్రియల్ 2024 (09:31 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్, పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 24వ తేదీన విడుదలకానున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యాశాఖ ఓ స్పష్టత ఇచ్చింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను ఈ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఈ యేడాది ఇంటర్ పబ్లిక్ పరీక్షలను గత ఫిబ్రవరి 28న నుంచి మార్చి 19వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెల్సిందే. రెండు సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 10 నుంచి ఈనెల 10 తేదీల మధ్య మూల్యాంకనాన్ని పూర్తి చేశారు.
 
గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 15 రోజుల ముందుగానే ఫలితాలు ప్రకటించబోతున్నారు. 2023లో మే 9వ తేదీన ఫలితాలను వెల్లడించారు. ఈసారి మార్కుల నమోదులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడుసార్లు పరిశీలించారు. కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియలను జాగ్రత్తగా పూర్తిచేశారు.
 
అలాగే తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలపై కూడా విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. ఈ నెల 30 లేదా మే 1వ తేదీన ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఇంటర్, పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో మంత్రులు కాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. కాగా పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మూల్యాంకనం శనివారం పూర్తయింది. డీకోడింగ్ అనంతరం ఫలితాలు వెల్లడించానున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు