హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌సీ కాలనీలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న ఓ యువకుడు గుండెపోటు మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మృతుడిని 31 యేళ్ల విష్ణువర్థన్‌గా గుర్తించారు. తమ కళ్లముందే ప్రదక్షిణలు చేసిన యువకుడు అంతలోనే మృతి చెందడంతో భక్తులు విషాదంలో మునిగిపోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన విష్ణువర్థన్ హైదరాబాద్ నగరంలో ఉంటూ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ యువకుడు సమీపంలో ఉండే ఆంజనేయస్వామి ఆలయానికి తరచుగా వెళుతుంటారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఆలయానికి వచ్చిన యువకుడు ప్రదక్షిణలు చేస్తుండగా గుండెలో నొప్పి రావడంతో ఆలయంలోని స్తంభాన్ని పట్టుకున్నాడు.
ఆ వెంటనే కుప్పకూలిపోయాడు. అది చూసిన భక్తులు వెంటనే అప్రమత్తమయ్యారు. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న అత్యవసర వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే సరికే విష్ణువర్ధన్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు ఆలయంలోని సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలను పరిశీలించి సహజ మరణంగా తేల్చారు.
ఇలాంటి ఘటనే కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో జరిగింది. జాకీ షోరూంలో షాపింగ్ చేస్తూ 37 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. మృతుడిని కలాల్ ప్రవీణ్ గౌడ్ గా గుర్తించారు. షోరూంలో కుప్పకూలిన ప్రవీణన్ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతోనే అతడు మరణించినట్టు ధ్రువీకరించారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థి కార్డియాక్ అరెస్ట్ మృతి చెందాడు.