హైదరాబాద్ నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు భారీ విగ్రహ ప్రతిష్టాపన జరుగనుంది. ఈ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తులో తెలంగాణ ప్రభుత్వం తయారు చేయించి ప్రతిష్టించనుంది. ఈ నెల 14వ తేదీన శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది.
దేశంలో ఇప్పటివరకు ఉన్న అంబేద్కర్ విగ్రహాల్లో అతిఎత్తైన విగ్రహం కానుంది. పార్లమెంట్ ఆకారంలో 50 అడుగుల పీఠం, ఆపైన 125 అడుగుల నిలువెత్తు లోహ విగ్రహాన్ని తయారు చేశారు. అంబేద్కర్ 132వ జయంతి వేడుకల సందర్భంగా ఈ విగ్రహాన్ని సీఎం కేసీఆర్, కొందరు బౌద్ధ గురువుల ప్రార్థనల మధ్య ఆవిష్కరిస్తారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. ఈ విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేందుకు వీలుగా రవాణా సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించనుంది. ఇందుకోసం వచ్చే వారిలో దాదాపు 50 వేలమంది కూర్చొనే విధంగా కుర్చీలు, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు.